మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతి ఇదేనా : మహిళా రైతులు

మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతి ఇదేనా : మహిళా రైతులు
మందడం నుంచి తమను వెంబడిస్తూ.. దూషిస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది. దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్న మందడం మహిళా రైతుల్ని పోలీసులు అడ్డగించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళా రైతులు అని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ బ్యారేజీపై బైఠాయించి మహిళా రైతులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు మహిళా రైతులు సృహ తప్పి పడిపోయారు.

మరోవైపు పోలీసుల తీరుపై మహిళా రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక్క ఛాన్స్ అన్న వ్యక్తి ఇప్పుడమేమైపోయాడంటూ ప్రశ్నిస్తున్నారు. శాంతియుతంగా దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్తున్న తమను అడ్డగించారని.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మందడం నుంచి తమను వెంబడిస్తూ.. దూషిస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమ ఉద్యమాన్ని అణచివేసినా.. ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని విరమించుకునే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరిస్తున్నారు.

అటు పోలీసుల తీరును నిరసిస్తూ సెక్రటేరియేట్‌కు మహిళలు, రైతులు కవాతుగా బయల్దేరారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజధాని రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. దీంతో హై టెన్షన్ నెలకొంది.

ఇక మందడం దీక్షాశిబిరం వద్ద వాతావరణం రణరంగాన్ని తలపిస్తోంది. రాజధాని ప్రాంత వాసులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజు మహిళలకు ఈ ప్రభుత్వం అరెస్టులను బహుమతిగా ఇచ్చిందని రైతులు తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు.



Tags

Read MoreRead Less
Next Story