AMARAVTAHI: అమరావతిలో ఆగని చోరీలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగ్రామాల్లో నిర్మాణ సామగ్రి చోరీలకు అడ్డుకట్ట పడటం లేదు. తుళ్లూరు, దొండపాడు గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి అక్కడ ఉన్న సామగ్రిని ఎత్తుకెళ్లిపోయారు. రాజధానిలో రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లలో అభివృద్ధి పనులను గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగా రహదారుల పక్కన భూగర్భ విధానంలో తాగు నీరు, డ్రైనేజీ, విద్యుత్తు వంటి సౌకర్యాలు కల్పించడం కోసం ఇనుప, జింక్ పైపులు అమర్చడానికి చిన్న సైజు ప్లాస్టిక్ పైపుల చుట్టలు అక్కడ నిల్వ చేశారు. వైసీపీ పాలనలో పనులు ఆగిపోవడంతో ప్రస్తుతం అక్కడ ముళ్ల చెట్లు ఏపుగా పెరిగాయి. దాంతో వాటి మధ్య ఉన్న పైపులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారు. తుళ్లూరు నుంచి అనంతవరం వెళ్తున్న రైతులకు అక్కడ పైపులు కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతంలోనూ ఇక్కడ కొందరు పైపులను కత్తిరించుకుని పోయారు. దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. మళ్లీ అదే ప్రాంతంలో చోరీ జరగడం గమనార్హం.
మేయర్ పీఠంపై కూటమి కన్ను
విశాఖలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జీవీఎంసీ కార్పొరేటర్లు 12 మంది ఆ పార్టీని వీడారు. ఏడుగురు తెలుగుదేశం పార్టీలో.. అయిదుగురు జనసేనలో చేరారు. దీంతో మేయర్ పీఠంపై కూటమి కన్నేసింది. తాజా చేరికలతో కార్పొరేషన్‌లో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉండగా.. కూటమి పార్టీల బలం 45కి చేరింది. వైసీపీ బలం 50కి పడిపోయింది. వైసీపీ కార్పొరేటర్లు మరికొందరు కూటమిలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వ ప్రజా విధానాలు నచ్చడం.. ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీలతో గెలిపించి వైసీపీని ఘోరంగా ఓడించడంతో జగన్ పార్టీని వీడినట్లు కార్పొరేటర్లు తెలిపారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల నడుమ సందడిగా చేరికల కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణల సమక్షంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేతుల మీదుగా కార్పొరేటర్లకు కండువాలు కప్పి కూటమి పార్టీల్లోకి ఆహ్వానించారు.
అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తామని ప్రతినబూనారు. గత వైసీపీ ప్రభుత్వం టీడీపీకి చెందిన వారిపై అనేక రకాలుగా ఒత్తిళ్లు తెచ్చి, ఆ పార్టీలో చేర్చుకుందని పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇప్పుడు తాము ఎవరిపైనా అటువంటి ఒత్తిళ్లు తేలేదని, కొత్త వారి రాకతో టీడీపీలో ఉన్న పాతవారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని స్పష్టం చేశారు. విశాఖ నగర అభివృద్ధే తమ ధ్యేయమని, అందుకు వివాదరహితులైన వైకాపా కార్పొరేటర్లను కూటమిలోకి తీసుకున్నామని వెల్లడించారు. కార్పొరేషన్‌లో మేయర్‌ను తొలగించడంపై త్వరలో నిర్ణయం ఉంటుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com