Andhra Pradesh : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై సందిగ్ధం..!

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం సందిగ్ధంలో పడింది. పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ఏపీ సర్కార్ .. ఆ దిశగా సన్నాహాలు సైతం మొదలుపెట్టింది. కానీ కేంద్రం కొత్త జిల్లాల పై చేసిన ప్రకటనతో ఏపీ సర్కార్ కసరత్తు ముందుకు సాగేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. విజయవాడకు చెందిన ఈనగంటి రవికుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇందుకు స్పందించిన కేంద్ర జనాభా లెక్కల విభాగం 2021 మార్చి 31 జనాభా లెక్కల పరిధిలోకి కొత్త జిల్లాల సరిహద్దులని పరిగణలోకి తీసుకబోమని స్పష్టం చేసింది. దేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, జిల్లాల సరిహద్దుల్లో మార్పు చేర్పులకు గడువు ముగిసిందని తెలిపింది. మార్చ్ 31 కల్లా జరిగిన మార్పులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ రిజిస్టర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది. ఇక అటు కొత్త పరిపాలన విభాగాల ఏర్పాటు అధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవేనని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. జనగణన ప్రారంభమయ్యే లోపు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి పొందితే జిల్లాల సరిహద్దులో మార్పులు పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది.
కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ సమాచారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలు ఏర్పాటు ప్రక్రియ సంక్లిష్టంగా మారినట్టు కనిపిస్తోంది. మరోవైపు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసిన ఈనగంటి రవికుమార్ కేంద్ర ప్రభుత్వం సమాధానం పై స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి తీసుకోవాలని అన్నారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవద్దని చెప్పారు. ఫలితంగా నీతి అయోగ్ ప్రణాళికలు కేంద్రం అమలు చేసే పథకాలు కొత్త జిల్లాల ప్రాతిపదికగా అమలు కావని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com