29 Dec 2020 4:02 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / మాటతప్పి.. మడమ తిప్పిన...

మాటతప్పి.. మడమ తిప్పిన మేనమామ..అమ్మఒడికి కోతలు!

ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి.

మాటతప్పి.. మడమ తిప్పిన మేనమామ..అమ్మఒడికి కోతలు!
X

మీ పిల్లలకి మేనమామ లాగా అండగా ఉంటా...! పిల్లలను స్కూల్‌కి పంపించిన ప్రతి తల్లికి మేనమామ కానుక కింద రూ.15 వేలు అకౌంట్‌లో వేస్తా..! ఇది ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ. కానీ సరిగ్గా ఏడాది తిరగ్గానే మేనమామ మాటతప్పారు..మడమ తిప్పారు. అమ్మఒడికి కోతలు ప్రారంభమయ్యాయి. సవాలాక్ష షరతులు వచ్చేశాయి. ఖర్చును తగ్గించుకోవడమే లక్ష్యంగా అమ్మఒడిని క్రమంగా ఆంక్షల సుడిగుండంలోకి నెట్టేస్తున్నారు. ఇప్పటికే పథకానికి తెల్లరేషన్‌కార్డులో లింకుపెట్టిన ప్రభుత్వం...తాజాగా అమ్మఒడి సాయానికి వెయ్యి రూపాయలు కోతపెట్టింది.

గత ఏడాది అమ్మఒడి కింద ప్రభుత్వం 15 వేలు ఇచ్చింది. ఆ తరువాత పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రతి తల్లి వెయ్యి రూపాయలు ఇవ్వాలని సర్కారు కోరినా పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తీసుకువచ్చి వెయ్యి రూపాయలు వసూలుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు ఈ నిధులు కేటాయించినా...ప్రైవేటు పాఠశాలల విషయంలో ఆరోపణలు వచ్చాయి. ఇక ఈసారి నేరుగా ప్రతి తల్లి ఖాతాకు వెయ్యి తగ్గించి కేవలం 14 వేల రూపాయలు మాత్రమే ఖాతాల్లో వేయాలంటూ జీవోనెంబర్ 63ని జారీచేసింది ప్రభుత్వం.

ముఖ్యమంత్రి జగన్ అమ్మఒడి విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. మహిళలకు తోబుట్టువు లాగా విద్యార్థులకు మేనమామలాగా అండగా ఉంటానని చెప్పి, ఇప్పుడు వారి వద్ద నుంచే డబ్బులు తీసుకోవడంపై విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన హామీకే తూట్లు పొడుస్తున్నారని, ఇప్పటికే అమ్మఒడి పథకానికి రకరకాల నిబంధనలు పెట్టి ఎక్కువమందికి సాయం అందకుండా ఆంక్షలు అమలు చేస్తున్నారు. అర్హులైన చాలామందికి అమ్మ ఒడికి దూరమయ్యారు. ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసం అమ్మఒడి నుంచి వెయ్యి రూపాయల కోత విధించింది.

ప్రతి పేదవాడికి న్యాణమై విద్య అందిస్తాం..ప్రభుత్వ స్కూల్ ను కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా తీర్చిదిద్దుతాం అని జగన్ సర్కార్ గొప్పలు చెప్పింది. నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ పథకంతో స్కూల్స్ రూపు రేఖలను ఎంత మార్చరో తెలియదు కానీ నిర్వహణ పేరుతో అమ్మ ఒడి నుంచి వెయ్యి రూపాయలు మాత్రం కోత విధించారు. ముఖ్యమంత్రి జగన్ ఎడమ చేతితో ఇచ్చి కుడి చేతితో తీసుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో అక్షరాస్యతను పెంచే లక్ష్యంతో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఏటా 15 వేల రూపాయలు జమచేసేలా ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరిలో తల్లుల ఖాతాల్లో ఈ మొత్తాలను ప్రభుత్వం జమచేసింది. మళ్లీ జనవరి 9న తల్లుల ఖాతాల్లో నగదు జమచేయాల్సి ఉంది..అయితే ఏడాది తిరగ్గానే అమ్మఒడికి ఎన్నో ఆంక్షలు..లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించడమే ఏకైక ఎజెండాగా రెండో విడతకు పలు షరతులు విధించింది. తెల్లరేషన్‌ కార్డుల రద్దు, ఒకటో తరగతిలో చేరే విద్యార్థి వయసు నిబంధన, ఆధార్‌ నంబరు తదితర నిబంధనలతో రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది తల్లులు 15వేల సాయానికి దూరం కానున్నారు.

Next Story