AP: ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు

AP: ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు
ఏపీ మంత్రివర్గం నిర్ణయం... పంట బీమాకు ప్రత్యామ్నాయ పథకంపై మంత్రుల కమిటీ

జగన్‌ ప్రభుత్వ హయాంలోతెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2022 రద్దుచేయాలని చంద్రబాబునాయుడు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో అమలైన పంటల బీమా పథకం స్థానంలో.. రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చేలా మెరుగైన పథకాన్ని అమలుచేయాలని తీర్మానించింది. దీని కోసం పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కె.అచ్చెన్నాయుడి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటుచేసింది. సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం.. పలు అంశాలపై విస్తృతంగా చర్చించింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఏపీలోని రైతులందరికీ మెరుగైన పంటలబీమా అందించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. మామిడి, విత్తన మొక్కజొన్న వంటి పంటలకూ వర్తింపజేసేందుకు వీలుగా ప్రతిపాదనలు చేయాలని.. మొత్తం పంటల బీమాపై అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. గత ప్రభుత్వ హయాంలో బీమా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. రెండేళ్లుగా బీమా సంస్థలకు ప్రీమియం చెల్లించకుండా రూ.1,251 కోట్లు బకాయి పెట్టింది.

ఇసుక, గనుల పాలసీ-2019, మెరుగైన ఇసుక విధానం-2021లను రద్దుచేస్తూ మంత్రివర్గంలో తీర్మానించారు. ఉచితంగా ఇసుక అందజేసేందుకు ఉద్దేశించిన జీఓ 43కి ఆమోదం తెలిపింది. వినియోగదారుల నుంచి స్థానిక సంస్థల సీనరేజి, రవాణా రుసుము మాత్రమే వసూలుచేస్తారు. ప్రస్తుతం 43 లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉందని.. పూడికతీత ద్వారా మరింతగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు జిల్లాస్థాయిలో అధికారుల కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీని తప్పుదోవ పట్టించేలా గత ప్రభుత్వ హయాంలో నివేదికలు ఇచ్చారని పేర్కొంది.

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా.. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఎన్‌సీడీసీ (జాతీయ సహకార అభివృద్ధి సంస్థ) నుంచి రూ.3,200 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు హామీ ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధాన్యం సేకరణ విధానంలోని లోపాలను సవరించాలని తీర్మానించారు. ధాన్యం సేకరణ కోసం వాణిజ్య బ్యాంకులు, ఇతర ఆర్థికసంస్థల నుంచి పౌరసరఫరాల సంస్థ తీసుకునే రూ.2వేల కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా మంత్రిమండలి ఆమోదించింది.

Tags

Next Story