Andhra Pradesh : చంద్రబాబు బలం, బలగం.. అంతా జనాలే

Andhra Pradesh : చంద్రబాబు బలం, బలగం.. అంతా జనాలే
అనపర్తిలో చంద్రబాబు సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు ప్రత్యేక బలగాలనూ మోహరించారు

ప్రజల్లోకి వెళ్తున్న ప్రతిపక్ష నేతల్ని అడ్డుకోవడానికే పూర్తి బలం, బలగం కేటాయిస్తున్నారు ఏపీ పోలీసులు . అటు లోకేష్ పాదయాత్రకు వెళ్తూంటే.. వజ్ర లాంటి వాహనాలతో వందల మంది పోలీసులు గుమికూడి కనిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనలో మూడో రోజూ అదే పని చేశారు. ఇక్కడ ఇంకా ఓవరాక్షన్ చేశారు. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఇచ్చి మళ్లీ ఎవరో చెప్పినట్లుగా రాత్రికి రాత్రి అనుమతి రద్దు చేశారు. అంతే కాదు చంద్రబాబు ఆనపర్తికి వెళ్లకుండా.. పోలీసులు వాహనాలకు అడ్డంగా కూర్చోవడం.. రోడ్లకు వాహనాలు అడ్డం పెట్టడం లాంటి పనులు కూడా చేశారు.


అనపర్తిలో చంద్రబాబు సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు ప్రత్యేక బలగాలనూ మోహరించారు. బారికేడ్లతో సభా ప్రాంగణాన్ని దిగ్బంధించారు. వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కార్యకర్తలు బహిరంగ సభాప్రాంగణంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో పోలీసులు లాఠీలతో చెదరగొట్టారు. పరిస్థితి అదుపు చేయడం సాధ్యం కాదనే ఉద్దేశంతో మార్గమధ్యలోనే చంద్రబాబును ఆపేసి అనపర్తి రాకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి ఒక బెటాలియన్‌ను, పోలీసు బృందాన్ని పంపించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డుకు అడ్డంగా బస్సును పెట్టి.. పోలీసులు చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు.

సైకో చెప్పాడని ముందు ఇచ్చిన అనుమతి రద్దు చేస్తారా? పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నాం.. రౌడీ రాజ్యాన్ని అంతమొందించడానికి ఇక్కడి నుంచే కౌంట్‌డౌన్‌ ప్రారంభిస్తున్నా. కాలినడకన అనపర్తి వెళ్తా అంటూ చంద్రబాబు వాహనం దిగి ముందుకు కదిలారు. ఆయన వెంట వేల మంది బయల్దేరారు. రాత్రి 8 గంటలకు అనపర్తి చేరుకున్న చంద్రబాబు దేవీచౌక్‌ ప్రాంగణంలోనే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చైతన్యరథం అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా బొలెరో వాహనం పెట్టారు. దానిపైకి ఎక్కి ప్రసంగిస్తున్నంతసేపు అడ్డుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు.ప్రసంగం మధ్యలో విద్యుత్తు సరఫరా నిలిపేసి.. జనరేటర్‌ వేయనీయకుండా ఇబ్బందులు సృష్టించడంతో సభకు హాజరైనవారు సెల్‌ఫోన్‌ వెలుగులు చూపించి టీడీపీ అధినేతకు మద్దతు పలికారు.

అనపర్తికి చంద్రబాబు వెళ్తే ఏమవుతుందో కానీ..పోలీసులు ఇలా ఓ ప్రతిపక్ష నేతను తన ప్రజాస్వామ్య హక్కు ప్రకారం.. పర్యిటంచకుండా పోలీసులు అడ్డుకోవడం ఏమిటన్న విమర్శలు ఎదురవుతున్నాయి. ఆనపర్తికి వెళ్లే దారిలోనే వాహనాలను అడ్డుకోవడంతో చంద్రబాబు వాహనం దిగి ఏడు కిలోమీటర్ల దూరంలోని ఆనపర్తికి నడుచుకుంటూ వెళ్లారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురవుతుంది.ఏ చట్టాల ప్రకారం అడ్డుకుంటున్నారో కానీ.. మొత్తానికి ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రజల్లోకి వెళ్లకూడదని.. వెళ్లాంటే.. తాము చెప్పినట్లుగా వెళ్లాలన్నట్లుగా పోలీసుల తీరు ఉంది.


నిజానికి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. మొదటి రెండు రోజుల పర్యటన తర్వాత … ఇంకా చంద్రబాబు టూర్ జరిగితే… జనం వెల్లువ ప్రజలకు కనిపిస్తే ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందనుకున్నారేమో కానీ.. రాత్రికి రాత్రి పోలీసులకు అనుమతి రద్దు చేస్తున్నట్లుగా చెప్పుకున్నారు. దీనికి కారణం వైసీపీ నేతలు చెప్పే ఇరుకు సందుగా చెప్పుకొచ్చారు. అనుమతి ఇచ్చేటప్పుడు అది ఇరుకు సందని తెలియదా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు ఇష్టారీతిన ర్యాలీలు .. పోలీసుల సహకారంతో నిర్వహిస్తూంటే.. చంద్రబాబు, లోకేష్ పర్యటనలపై మాత్రం పోలీసులు తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story