Andhra Pradesh : జగన్ సర్కారు తీరుపై నల్లపాటి రాము ఫైర్

జగన్ సర్కారు, పోలీసులపై టీడీపీ నేత నల్లపాటి రాము ఫైర్ అయ్యారు. బాలకోటిరెడ్డిని తుపాకీతో హత్య చేయడం దారుణమన్నారు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పోలీసులు వైసీపీ నాయకులకు తొత్తులుగా మారిపోయారని మండిపడ్డారు. ఎస్పీ మాటలు పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటన్న నల్లపాటి రాము.. పోలీసుల కాల్ రికార్డులు తక్షణమే పరీక్షించాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పల్నాడు హత్యలపై చర్యలు తీసుకుంటామని నల్లపాటి రాము స్పష్టంచేశారు.
గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. రోడ్డుపై బైఠాయించి టీడీపీ నేతలు నిరసనకు దిగారు. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెన్నా బాలకోటిరెడ్డి మృతదేహానికి తక్షణమే పోస్టుమార్టం చేసి ఇవ్వాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. దాంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం.. తోపులాటతో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ హత్యలు చేసి టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రాణాలు తీసిన వారికి పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని టీడీపీ నేతల హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com