Andhra Pradesh : సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి నిరాశ

మరోసారి సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు ఇవాల్టీ విచారణ లిస్ట్ లో కనిపించలేదు. అమరావతిపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రైతులు, అమరావతి పరిరక్షణ సమితి, ఇతరులు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటి విచారణ త్వరగా చేపట్టాలంటూ జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి ఈ నెల 6న ప్రస్తావించారు.
అమరావతి JAC, రైతుల తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలుకు తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జోసెఫ్ కేసును ఫిబ్రవరి 23న తొలి కేసుగా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అయితే ఒకసారి నోటీసు అయిన అంశాలను బుధ, గురువారాల్లో విచారించబోమంటూ ఈ నెల 14న సుప్రీంకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఈ కేసులను ఇవాల్టీ విచారణ జాబితాలో చేర్చలేదని కోర్టు వర్గాలు అంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com