YS Jagan Delhi Tour : ఇవాళ ఢిల్లీకి సీఎం జగన్.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ

YS Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ ఇవాళ ఢిల్లీ వెళుతున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అలాగే హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు మరికొందరు కేంద్రమంత్రుల్ని కూడా జగన్ కలిసే అవకాశం ఉంది. సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ టూర్ ఆసక్తి రేపుతోంది.
సడెన్‌గా ఢిల్లీ వెళుతున్న జగన్... చాన్నాళ్ల తర్వాత ప్రధానితో భేటీ అవుతున్నారు. అసలు ఢిల్లీ టూర్ మర్మమేమిటి అన్నది చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకే అంటున్నాయి వైసీపీ వర్గాలు. కొత్త జిల్లాలు, ఆర్థిక పరిస్థితులు, పోలవరం అంచనాల ఆమోదంపై చర్చలు జరుపుతారని పేర్కొంటున్నాయి. అయితే జగన్ ఢిల్లీ టూర్ ఇంతకీ మించి ఏదో మతలబు ఉందని తెలుస్తోంది.
ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు భర్తీ కావాల్సి ఉండడం, రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యసభ స్థానాలు, రాష్ట్రపతి ఎన్నికలపైనా మాట్లాడతారంటూ మరో ప్రచారం జరుగుతోంది. ఏపీ నుంచి ఖాళ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీజేపీ కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఓ పారిశ్రామిక వేత్త కూడా ఏపీ నుంచి రాజ్యసభ ఆశిస్తున్నారు. ఇప్పటికే వైసీపీకి ఈ విషయంలో సిఫార్సులు వెళ్లాయంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దుతు కోసమే జగన్‌ను ఢిల్లీకి పిలిపించారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మరో ఏపీ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతుండడం, అప్పుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో జగన్ ఈ అంశంపైనే ఢిల్లీ వెళుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఎల్లుండి జరిగే మంత్రివర్గ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. రేపు జరగాల్సిన వాలంటీర్ల సన్మానం కార్యక్రమం 7వ తేదీకి వాయిదా పడింది. 7న నరసరావుపేట సభ తర్వాత మధ్యాహ్నం కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com