అప్పుల్లో రోజురోజుకు పైకెళుతోన్న ఏపీ

అప్పుల్లో రోజురోజుకు పైకెళుతోన్న ఏపీ
అప్పుల్లో రోజురోజుకు పైకెళుతోన్న ఏపీ

అభివృద్ధిలో మాటెలా ఉన్నా అప్పుల్లో మాత్రం ఏపీ నానాటికీ పైపైకే వెళ్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ప్రభుత్వం ఏకంగా 33 వేల 294 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చింది. ఈ ఏడాది మొత్తం నిర్దేశించుకున్న మొత్తంలో ఇది ఏకంగా 68 శాతం. అంటే.. మొత్తం అప్పుగా అవసరం అవుతుందని భావించిన దాంట్లో 3 వంతులకు 2 వంతులు అప్పుడే వాడేశారు. ఖజానా ఎంత లోటులో ఉందో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు కూడా కటకటలాడాల్సిన పరిస్థితులు. దీనికి తోడు సంక్షేమ పథకాలకూ భారీగా నిధులు కావాలి. ఐతే.. ఇందుకు తగ్గట్టు ఆదాయం లేకపోవడంతో అందినకాల్లా అప్పులు చేసి నెట్టుకొస్తోంది జగన్ సర్కారు.

ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లు 21 వేల కోట్లు ఉంటే.. ఖర్చులు మాత్రం రెట్టింపు స్థాయిలో 48 వేల కోట్ల వరకూ ఉన్నాయి. కాగ్ లెక్కల ప్రకారం చూస్తే రెవెన్యూ లోటు 27 వేల కోట్లకు పైగా ఉంది. తొలి త్రైమాసికంలో మొత్తం ఖర్చును 54 వేల 335 కోట్లుగా చూపిస్తే అందులో రుణాల రూపంలో తెచ్చింది 61 శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ప్రభావం అన్ని రంగాలపైన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గింది. ఇలాంటివన్నీ బేరీజు వేసుకుంటూ ఆర్థికస్థితిని గాడిలో పెట్టకపోతే మున్ముందు మరింత ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఏపీకి ఈ ఫస్ట్ క్వార్టర్‌లో పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం 12 వేల 531 కోట్లు. GST రూపంలో కానీ, రిజిస్ట్రేషన్ల రూపంలో కానీ, ఇతరత్రా పన్నుల రూపంలో కానీ వసూలైంది ఇది మాత్రమే. నిజానికి ఆర్థిక శాఖ ఈ ఏడాది రెవెన్యూ వసూళ్లు 1 లక్షా 2 వేల 917 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దీనికి తగ్గట్టే బడ్జెట్‌నూ రూపొందించింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మొత్తం లెక్కలన్నీ తల్లకిందులయ్యే పరిస్థితి. అంచనా వేసిన ఆదాయంలో ఈ 3 నెలల్లో వచ్చింది 12 శాతం మాత్రమే. ఈ గడ్డు పరిస్థితుల్ని ప్రభుత్వం ఎలా నెట్టుకొస్తుందో చూడాలి. కరోనా ఎఫెక్ట్‌తో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గినా ఏపీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందనేది నిపుణుల మాట. అటు, ఈసారి కోవిడ్ కారణంగా కేంద్రం రాష్ట్రాలకు కొంత వెసులుబాటు ఇచ్చింది. FRBM పరిమితి పెంచుకునే అవకాశం ఇచ్చింది. దీనివల్ల మరికొంత ఎక్కువగా అప్పు తీసుకునే అవకాశం లభించింది.

YCP పాలనలో అప్పులతో ప్రభుత్వాన్ని నెట్టుకు వస్తున్న పరిస్థితిపై TDP అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం కౌంటర్ ఇచ్చారు. విభజన నాటికి, టీడీపీ పాలనకు, ఇప్పటికి తేడాలేంటో స్పష్టంగా వివరించారు. ఏటా YCP ప్రభుత్వం 50 వేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నా అదంతా అవినీతి దెబ్బకు ఆవిరైపోతుందన్నారు. ప్రాజెక్టులపై కానీ, పారిశ్రామికరంగంపై కానీ పెట్టుబడులు పెట్టందే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఖజానా నింపుకునేందుకు పెట్రోల్, లిక్కర్‌ సహా వివిధ ట్యాక్సులు పెంచి తిరిగి ప్రజలపైనే భారం మోపుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం 15 నెలల్లో లక్ష కోట్ల రూపాయల అప్పులు చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి. సంపాదించి ఖర్చు పెడితే సంక్షేమం అంటారని.. ఆదాయం లేకుండా చేస్తే మాత్రం అది పతనానికి దారి తీస్తుందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story