ఆదాయం మూరెడు..అప్పులు బారెడు అన్నట్టుగా ఏపీ ఆర్థిక పరిస్థితి..వేరే దారిలేక ఇలా..

ఆదాయం మూరెడు..అప్పులు బారెడు అన్నట్టుగా ఏపీ ఆర్థిక పరిస్థితి..వేరే దారిలేక ఇలా..
రాష్ట్రాన్ని నడిపించడానికి అప్పులు తెస్తున్నప్పటికీ..చెల్లించాల్సిన బకాయిలు మీద పడడంతో..వేరే దారి లేక ఇలా చేస్తున్నసర్కార్

ఆదాయం మూరెడు.. అప్పులు బారెడు అన్నట్టుగా సాగుతోంది ఏపీ పరిస్థితి. ఏ నెలకు ఆ నెల అప్పులతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి మొదలై పది రోజులు దాటిపోయినా.. ఇప్పటి వరకు ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు, పింఛన్లు పూర్తిస్థాయిలో చెల్లించలేదని తెలుస్తోంది. రాష్ట్రాన్ని నడిపించడానికి అప్పులు తెస్తున్నప్పటికీ.. చెల్లించాల్సిన బకాయిలు మీద పడడంతో.. వేరే దారి లేక వేతనాలు, పెన్షన్లను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది. గత నెలలో 2800 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో ఈనెల ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన మొత్తంపై ప్రభావం పడినట్లు చెబుతున్నారు.

ఇప్పటికే ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిధి దాటేసిన ప్రభుత్వం.. పూర్తిస్థాయి జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే మరో వేయి కోట్లు అవసరం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 400 కోట్ల అప్పు కోసం నాబార్డుతో ఆర్థిక శాఖ ఒప్పందం చేసుకుందని తెలుస్తోంది. నాబార్డు నుంచి 400 కోట్లు వస్తే వాటిని వేతనాల చెల్లింపులకు సర్దుబాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇక వచ్చే నెల చెల్లించాల్సిన వేతనాల కోసం 3వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆర్‌బీఐ ద్వారా ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీలు వేలం వేయడం ద్వారా ఈ 3వేల కోట్లు సమీకరించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆఖరి అవకాశం ఆర్‌బీఐ నుంచి రుణం సమీకరించడమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు జీతాలు, పెన్షన్లకే అప్పులు చేయాల్సి వస్తుండడంతో బకాయిల చెల్లింపులు సాధ్యం కావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి.. కొత్తగా అప్పులు తెచ్చుకోవచ్చన్నది ప్రభుత్వ ప్లాన్.


Tags

Read MoreRead Less
Next Story