ఏపీలో ఉంటున్న ఒక్కొక్కరి తలపై రూ. 70 వేల అప్పు!

ఏపీలో ఉంటున్న ఒక్కొక్కరి తలపై రూ. 70 వేల అప్పు!
అప్పులు చేయడంలో జగన్ ప్రభుత్వం కొత్త రికార్డులు నమోదుచేస్తోందంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు

ఏపీలో ఉంటున్న ఒక్కొక్కరి తలపై 70 వేల రూపాయల అప్పును పెట్టింది జగన్ ప్రభుత్వం. దీన్నే ఆర్థిక భాషలో తలసరి అప్పు అంటారు. జగన్‌ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అప్పుల కుప్ప పెరిగిపోతూనే ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు ఒక్కొక్కరిపై 13 వేల రూపాయల అప్పును పెట్టింది జగన్ సర్కార్. ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి ఇంకా మూడు నెలల సమయం ఉంది. ఇప్పటికీ.. రాష్ట్రాన్ని నడిపించడం కోసం అప్పులు తెచ్చుకునే ప్రయత్నాల్లోనే ఉంది జగన్‌ ప్రభుత్వం. నవంబర్‌ నెల వరకు 73 వేల 811 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది ప్రభుత్వం. డిసెంబర్‌ను కూడా కలుపుకొంటే.. ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు.. అంటే మరో 4 నెలల పాటు ఇలా అప్పులు చేయాల్సిన పరిస్థితే ఉందంటున్నారు అధికారులు. అంటే.. ఏపీలో ఉంటున్న ఒక్కొక్కరి తలపై అప్పుల భారం మరింత పెరుగుతుందనే అర్థం.

అప్పులు చేయడంలో జగన్ ప్రభుత్వం కొత్త రికార్డులు నమోదుచేస్తోందంటూ విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు. కేవలం 20 నెలల్లో జగన్ సర్కారు తీసుకొచ్చిన అప్పులు లక్ష కోట్ల రూపాయల పైమాటే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాగ్‌ తేల్చిన లెక్కల ప్రకారం ఇప్పటికే 73వేల కోట్ల రూపాయల వరకు రుణం ఉంది. ఇంకా డిసెంబర్ నెల లెక్కలు తేలాలి. రానున్న మూడు నెలల్లో మరింతగా రుణాలు తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అప్పుడే తెల్లారిందా అనేది కామెడీ డైలాగు. జగన్ ప్రభుత్వానికి మాత్రం ఇది రొటీన్‌ డైలాగ్‌ అంటూ విమర్శిస్తోంది టీడీపీ. రాష్ట్ర ప్రభుత్వం దొరికిన చోటల్లా అప్పులు చేస్తోందని ప్రతిపక్షాలు రోజూ విమర్శిస్తూనే ఉన్నాయి. బహిరంగ మార్కెట్‌ నుంచి, కేంద్రం నుంచి, ఇతర సంస్థలు, పీఎఫ్‌, చిన్నమొత్తాల పొదుపు, బ్యాంకులు, రుణసంస్థలు.. ఇలా వీలైనన్ని మార్గాల్లో అప్పులు చేస్తోంది జగన్ ప్రభుత్వం.

రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయంలో 90 శాతం వరకు అప్పులు తెచ్చుకోవచ్చు. కాని, ప్రభుత్వం మాత్రం ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని అన్వేషించడం లేదని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, కొత్త కంపెనీలు రావడం లేదని, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలేవీ జరగడం లేదని ఇప్పటికే ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఆదాయాన్ని పెంచకపోగా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story