NADENDLA: 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు

NADENDLA: 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు
X
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచకంతో ఏపీ ఆర్థికంగా చాలా వెనుకబడిందన్నారు. రూ.12 లక్షల కోట్ల అప్పులు చేశారని నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని.. ఆమేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు. కష్టకాలంలో ఉన్నా గత నెలలో రూ.వెయ్యి కోట్లు విడుదల చేశామని.. ఇప్పుడు మిగిలిన రూ.674 కోట్లు అందజేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో రూ.472 కోట్లు వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందజేయలేదని విమర్శించారు. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి చెప్పారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకాడబోమని.. చివరి గింజ వరకూ కొంటామని నాదెండ్ల వెల్లడించారు.

వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం

గత ప్రభుత్వం రైతులను సంక్షోభంలో నెట్టేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు డబ్బులు కూడా చెల్లించలేదన్నారు. రూ. 40,500 కోట్ల రుణాలు సివిల్ సప్లై సంస్థ పేరు మీద గత ప్రభుత్వం రుణాలు తీసుకుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆర్ధికంగా చేసిన అరాచకాలకు బ్యాంకులు భయపడిపోయాయన్నారు. కూటమి సర్కారు ఆధికారంలోకి వచ్చాక తాము ఫోన్ చేస్తుంటే బ్యాంకర్లు ఫోన్లు ఎత్తడం మానేశారని మనోహర్ తెలిపారు. రైతులకు ఎక్కడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా పని చేయాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో దళారులు స్వార్ధంతో రైతులను ఇబ్భంది పెట్టారని.. వ్యాపారవేత్తలే కాదు.. రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెయ్యాలని.. దానికి అనుగుణంగా చర్యలు చేపట్టామని మనోహర్ పేర్కొన్నారు.

గతంలో రైతులకు ఇబ్బందులు కలిగించడానికి ధాన్యం కొనుగోలులో మిల్లుల చుట్టూ తిప్పారన్నారు. కంప్యూటర్ ఇచ్చిన చీటీల వలనే అలా జరిగిందని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారన్నారు. కానీ అవి కంప్యూటర్ చీటీలు కాదని.. మిమ్మల్ని ఇబ్భంది పెట్టడానికి వైసీపీ చేసిన కుట్ర అని పేర్కొన్నారు. బ్యాంకులకు ఫౌర సరఫరాల సంస్థ చెల్లించాల్సిన బకాయిల్లో మార్చి 30వ తేదీనాటికి 10 వేల కోట్ల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉంటుందన్నారు. రైతులకు పంట బీమా ప్రీమియంను ఉచితంగా ప్రభుత్వమే చెల్లించేలా యోచన ఉందన్నారు.

Tags

Next Story