Andhra Pradesh: విశాఖ మన్యంలో గంజాయి సాగు.. !

Andhra Pradesh: విశాఖ మన్యంలో గంజాయి సాగు.. !
Andhra Pradesh: విశాఖ మన్యంలో గంజాయి సాగు విస్తారంగా సాగుతోంది.

Andhra Pradesh: విశాఖ మన్యంలో గంజాయి సాగు విస్తారంగా సాగుతోంది. అత్యంత రహస్యంగా పండించే ఈ పంటను..ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో 15 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగు చేస్తుండటం పరిస్థితికి అద్దంపడుతోంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉండటానికి కారణమిదే. ఏటా ఇక్కడి నుండి 25వేల కోట్ల విలువైన గంజాయి.. దేశ, విదేశాలకు అక్రమంగా తరలుతోందని అనధికారిక అంచనా.

విశాఖ మన్యంలో గంజాయి సాగు నుంచి దాన్ని దేశ నలుమూలలకు తరలించటం వెనుక మహారాష్ట్ర, తమిళనాడు, కేరళకు చెందిన ముఠాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఏపీలోని వివిధ జిల్లాలవారూ ఈ దందాలో క్రియాశీలకంగా మారారు. సరకును ఒక చోటి నుంచి మరోచోటకి చేరవేసే కొరియర్లు, తక్కువ మొత్తంలో రవాణా చేసేవారిని పట్టుకోగలుగుతున్న పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు.. అసలు సూత్రధారుల గుట్టును రట్టు చేయలేకపోతున్నారు.

రోడ్డు, రైలు మార్గాల ద్వారా నిత్యం వేల టన్నుల గంజాయి ఏపీ మీదుగా దర్జాగా తరలిపోతున్నా.. అందులో 2నుంచి 3 శాతాన్ని మాత్రమే దర్యాప్తు సంస్థలు పట్టుకోగలుగుతున్నాయి. గతంలో ఎప్పుడు గంజాయి పట్టుబడ్డా 10-15 కిలోల రేంజ్‌లో ఉండేది.. ఇప్పుడు అది వందల కిలోలకు చేరిందంటే..దందా ఏ రేంజ్‌లో జరుగుతుందో అర్థమవుతుంది. కొన్నేళ్ల కిందటి వరకు విశాఖ మన్యంలో వందల ఎకరాల్లో గంజాయి సాగయ్యేది.

ఈ ప్రాంతం మత్తు ముఠాలకు అనుకూలంగా ఉండటంతో పాటు.. భారీగా డిమాండ్‌ ఉన్న నాణ్యమైన శీలావతి రకం గంజాయి ఇక్కడ పండుతుండటంతో.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు మాదకద్రవ్యాల ముఠాలు ఇక్కడ పాగా వేసేశాయి. రాష్ట్రంలోని ముఖ్య రాజకీయ నాయకుల అండదండలతో గంజాయి సాగు మూడు పువ్వులు అరవై కాయలు అన్నట్లు వర్థిల్లుతోంది. గిరిజనుల భూముల్ని కౌలుకి తీసుకుంటున్న ముఠాలు.. వారితోనే గంజాయి సాగు చేయిస్తున్నాయి.

ఇలా పండించిన మత్తు పదార్థాన్నిదేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి వేల కోట్లు అక్రమంగా అర్జిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కడప, కర్నూలు జిల్లాల నుంచి వెళ్లి పాగావేసిన వారూ భారీగా దందా నడుపుతున్నారు. తీగ లాగి డొంక వదిలేస్తున్న పోలీసులు, ఎస్‌ఈబీ అధికారులు.. దాడులు చేసి చిన్నచిన్న కొరియర్లను పట్టుకుని కేసులు పెడుతున్నారు. విశాఖ మన్యం నుంచి విదేశాల వరకూ వేళ్లూనుకుపోయిన మత్తు మాఫియా మూలాలను ఛేదించడంలో మాత్రం విఫలమవుతున్నారు.

మన్యం గ్రామాల్లోకి కొత్తగా ఎవరొస్తున్నారు? వారి మూలాలేంటి? ఎక్కణ్నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు అనే దానిపై నిఘా ఉండట్లేదు. సరఫరా దశలోనే గంజాయి ఎక్కడికి చేరుతుందో గుర్తించగలిగితే.. సూత్రధారుల మూలాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి ప్రయత్నాలేవీ కనిపించట్లేదు. విశాఖ మన్యం నుంచి గంజాయి.. ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, పశ్చిమబెంగాల్‌, సిక్కిం, నాగాలాండ్‌, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒడిశాలకు.. తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు, అక్కడి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు.. చెన్నై మీదుగా సముద్ర మార్గంలో శ్రీలంక, ఇతర దేశాలకు సరఫరా అవుతోంది.

దీంతో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలలు ఏపీలోనే ఉంటున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ వాహనాన్ని డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేయగా 972 కిలోల గంజాయి దొరికింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ఏపీ నుంచి తరలిస్తున్న 120కిలోల గంజాయిని చెన్నై పోలీసులు జులై నెలలో పట్టుకున్నారు. గంజాయిని ద్రవరూపంలోకి మార్చి గుజరాత్‌లోని వడోదరకు తరలించే ప్రయత్నంలో ఉన్న ఓ ముఠా..గుంటూరు అర్బన్‌ పోలీసులకు చిక్కింది.

హైదరాబాద్‌ అయితే ఏపీ నుంచి తరలించే గంజాయికి రవాణా కేంద్రంగా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో తరచూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. మహారాష్ట్రకు చెందిన కాలే గ్యాంగ్‌, పవార్‌ గ్యాంగ్‌లు గంజాయి అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో గంజాయి మొక్క నుంచి సగటు దిగుబడి 250 నుంచి 350 గ్రాములు. అంటే ఎకరానికి 1000 నుంచి1500 కిలోలు. నాణ్యతను బట్టి కిలో గంజాయి 2,500 నుంచి 6,000 రూపాయల వరకు పలుకుతుంది.

ఈ లెక్కన ఎకరా గంజాయి సాగుకు సీజన్‌కు 45లక్షల రూపాయల చొప్పున రెండు సీజన్లకు 90లక్షల రూపాయలు వస్తుంది. ఎకరా సాగుకు ఖర్చు రెండు సీజన్లకు కలిపి 5లక్షలే అవుతుంది. దీంతో ఎకరాకు 85లక్షల రూపాయలు మిగులుతుంది. ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దులో 15వేల ఎకరాల్లో జరుగుతున్న ఈ మత్తు దందా మార్కెట్‌ విలువ 25వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇదే సరుకు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లేసరికి రేటు కనీసం మూడు రెట్లు పెరుగుతుంది. దీంతో గంజాయి మార్కెట్‌ విలువ వేల కోట్లల్లో ఉంటోంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న గంజాయి దందాపై.. మరీ ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి మాఫియా మూలాల్లోకి వెళుతుందో.. లేదా చిన్నాచితక కొరియర్లను పట్టుకుని తూతూమంత్రంగా చేతులు దులుపుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story