Andhra Pradesh: జగన్‌ సర్కారుకు కేంద్రం ఊహించని షాక్..

Andhra Pradesh: జగన్‌ సర్కారుకు కేంద్రం ఊహించని షాక్..
Andhra Pradesh: జగన్‌ సర్కారుకు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి వచ్చిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను లాగేసుకుంది.

Andhra Pradesh: జగన్‌ సర్కారుకు కేంద్రం ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి వచ్చిన దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను లాగేసుకుంది. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ, ఇతర నిధులు ఇక ఖజానాలో పడతాయని ఎదురుచూస్తున్న అధికారులకు కేంద్రం ఊహించని దెబ్బేసింది. పాత బకాయిల కింద ఏకంగా 982 కోట్ల రూపాయలు మినహాయించుకుంది. దీంతో ఆర్థిక శాఖ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ వెయ్యి కోట్ల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటే.. కేంద్రం ఇంత షాక్ ఇచ్చిందేంటా అని తెగ మదనపడిపోతున్నారు అధికారులు.


ఇప్పటి వరకు ఏపీకి అప్పులు ఇవ్వడమే తప్ప.. బకాయిలు తీసుకోవడమే తెలియని కేంద్రం ఆ పని మొదలుపెట్టింది. జగన్ సర్కార్ వారం వారం అప్పుల కోసం కేంద్రం వెనక పడుతూనే ఉంటుందనేది డిపార్ట్‌మెంట్లలో వినిపించే టాక్. ఏడాదిలో 365 రోజులుంటే... అందులో 300 రోజుల పాటు అప్పులకు వెళ్లిన చరిత్ర ఉందని టీడీపీ తేదీలతో సహా చెబుతోంది. మంగళవారం వచ్చిందంటే చాలు ఆర్‌బీఐ నిర్వహించే వేలంలో పాల్గొని అప్పు తెచ్చుకోవాల్సిందే అన్న రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉండేదంటున్నారు.



మంగళవారం అప్పు పుట్టకపోతే.. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోద్దని కామెంట్స్ చేస్తున్నారు. జీతాలు చెల్లించాలన్నా అప్పే, పెన్షన్లు ఇవ్వాలన్నా అప్పే, బటన్‌ నొక్కాలన్నా అప్పే. ఇవాళ్టికి కూడా అప్పు కోసం జగన్ ప్రభుత్వం వెంపర్లాడుతూనే ఉందని ఎద్దేవా చేస్తోంది టీడీపీ. అసలే పూర్తిస్థాయిలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేక గిలగిల కొట్టుకుంటుంటే.. మధ్యలో ఈ కేంద్రం కటింగ్‌లు ఏంటంటూ గింజుకుంటున్నారు.


అప్పుడప్పుడు అప్పు కూడా తీర్చేయాలి. లేదంటే అప్పు లావైపోద్దీ అంటోంది కేంద్రం. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఈ నెల కూడా జీఎస్టీ వాటా కింద 682 కోట్లు ఏపీకి ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇవికాకుండా మరో 300 కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు సమాచారం పంపింది. మొత్తంగా 982 కోట్లు ఖజానాకు రాబోతున్నాయనగా.. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావాల్సిన పాత బకాయిల కింద ఈ మొత్తాన్ని మినహాయించుకుందీ కేంద్రం. దీంతో ఆర్థిక శాఖ అధికారులకు దిక్కుతోచడం లేదు.


కేంద్రం మినహాయించుకున్న నిధులను తిరిగి తెచ్చుకోవడం అంత సులభమేం కాదంటోంది ఆర్థిక శాఖ. అసలే సకాలంలో జీతాలు చెల్లించలేక సతమతమవుతున్న జగన్‌ సర్కార్‌కు కేంద్రం షాక్ ఇవ్వడంతో ఆర్థిక యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. కేంద్రం ఇచ్చే ఈ వెయ్యి కోట్లతో పాటు రెవెన్యూ లోటు భర్తీ కింద వచ్చే 900 కోట్లు కలిపి.. ఈసారికి ఎలాగోలా జీతాల టెన్షన్‌ తప్పించుకోవచ్చనుకుంటే.. కేంద్రం ఇలా చేసిందేంటి అని తెగ మదనపడిపోతున్నారు. పైగా అప్పు చేస్తే తప్ప జీతాలు చెల్లించలేనంత స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందంటున్నారు కొందరు అధికారులు. అలాంటిది ఒకేసారి వెయ్యి కోట్లు మినహాయించుకుంటే ఎలా అని కిందామీద పడిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story