అప్పులు తీసుకోవడంలో దూసుకెళ్తోన్న ఏపీ సర్కారు.. దేశంలోనే 4వ స్థానం..

అప్పులు తీసుకోవడంలో దూసుకెళ్తోన్న ఏపీ సర్కారు.. దేశంలోనే 4వ స్థానం..
అప్పుల్లో దేశంలోనే 4వ స్థానంలో నిలిచిన ఏపీ

అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన లెక్కల ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 44వేల 250 కోట్లు బహిరంగ మార్కెట్ ద్వారా అప్పులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ లెక్కన బహిరంగ మార్కెట్ల నుంచి అప్పులు తీసుకోవడంలో ఏపీ సర్కారు దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేవ్ ప్రభుత్వం డిసెంబర్‌లో 30 రోజులపాటు స్పెషల్ డ్రాయింగ్‌ సౌకర్యం, 26 రోజులపాటు చేబదుళ్లు, 3 రోజులపాటు ఓవర్ డ్రాప్ట్‌ సౌకర్యాలను ఉపయోగించుకున్నట్లు ఆర్‌ బీఐ వెల్లడించింది. అయినా ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కలేక పోయింది.

నెలవారిగా బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకున్నాక కూడా రాష్ట్ర ఆర్ధిక అవసరాలు తీరకపోవడంతో... ప్రభుత్వాలు ఈ డ్రాయింగ్‌ సౌకర్యం, చేబదుళ్లు, ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాలు ఉపయోగించుకొని... ఆర్ధిక ఇబ్బందులనుంచి గట్టెక్కుతాయి. అలా కాకుండా మూడింటిని ఏపీ సర్కారు ఒక దాని తర్వాత ఒకటి వాడుకోవడం దాని ఆర్ధిక ఇబ్బందులకు అద్దం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ నాటికి ఏపీ సర్కారు గత ఏడాది 12 నెలల్లో తీసుకున్న దానికంటే 4.3 శాతం అధికంగా అప్పులు చేసినట్లు ఆర్ బీఐ వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల కాలంలో 73 వేల912 కోట్లను అప్పుల రూపంలోనే సమకూర్చుకున్నట్లు కాగ్ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ అంచనాలతో పోలిస్తే ఇది రెట్టింపు. కరోనా వల్ల రెవెన్యూ ఆదాయం తగ్గిపోవడంతో ప్రారంభంలో అప్పులు చేయక తప్పలేదని ఆర్థికశాఖ అధికారులు చెబుతున్నారు.. అయితే రెవెన్యూ రాబడి గత ఆర్థిక సంవత్సరం కన్నా ఎక్కువగా వస్తున్నాయని కాగ్ స్పష్టంచేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకు రెవెన్యూ రాబడి 85 వేల 987 కోట్లు ఉంటే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 88 వేల 238 కోట్లకు చేరాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో 46వేల 503కోట్లు అప్పు చేయగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా 73వేల 912కోట్లకు చేరింది. అప్పటి అప్పు అంచనాలతో పోలిస్తే 131శాతం అధికంగా ఉండగా... ప్రస్తుత సంవత్సరంలో అది అంచనాల కన్నా 153 శాతానికి చేరుకుంది.

ఏపీ సర్కారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి.... కొత్త పథకాలు ప్రవేశ పెట్టి నగదు బదిలీలు చేస్తుండటం ఆర్ధిక భారం పెరిగిపోవడానికి కారణంగా తెలుస్తోంది. దీని కారణంగా ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. అప్పుల నుంచి గట్టెక్కే చర్యలు చేపట్టాల్సిన సర్కారు...చేసిన అప్పులను తీర్చేందుకు ప్రభుత్వ ఆస్తులను విక్రయించే ప్రయత్నం చేస్తుందని విపక్ష పార్టీలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి.


Tags

Next Story