Andhra Pradesh Rainfall: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు.. అయోమయంలో ప్రజలు..

AP Rains (tv5news.in)
Andhra Pradesh Rainfall: కర్నూలు జిల్లా మహానంది, బండి ఆత్మకూరు మండలాల్లో అకాల వర్షం.. రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగింది. వారం రోజుల్లో చేతికి వస్తుందనుకున్న పంట.. నేలవాలడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన వారిలో కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారు. అప్పులు తీసుకువచ్చి పెట్టుబడి పెడితే.. పంట చేతికందకుండా పోయిందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక్క మహానంది మండలంలోనే 490 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. బండి ఆత్మకూరు మండలంలోని ఈర్నపాడు, శింగవరం, వెంగళరెడ్డి పేట, ఎ.కోడూరు.. పార్నపల్లే గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నసాయంత్రం నుంచి పడుతున్న వానతో ఒంగోలు నగరం జలమయం అయింది. లోతట్టుప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. వరద పొంగిపొర్లడంతో రహదారిపై మోకాళ్లలోతు నీళ్లు నిలిచిపోయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో వర్షం నీరు పోయే మార్గంలేక పరిస్థితి మరింత జఠిలంగామారింది. స్థానిక బాలాజీ మార్కెట్ కాంప్లెక్స్, ఆర్టీసీ డిపో, ఏకలవ్యనగర్, మస్తాన్ దర్గా సెంటర్‌లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com