Andhra Pradesh: ఏపీలో కొత్త రాజకీయ పార్టీకి రంగం సిద్ధం..?

Andhra Pradesh: ఏపీలో కొత్త రాజకీయ పార్టీకి రంగం సిద్ధం..?

This is a Test Caption

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో పార్టీ వస్తోందా? కాపులు ఈ కొత్త పార్టీని పెట్టబోతున్నారా?

Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో పార్టీ వస్తోందా? కాపులు ఈ కొత్త పార్టీని పెట్టబోతున్నారా? కాపు సామాజిక వర్గంలో కొందరు పెద్దలు.. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన పార్టీపై చర్చించారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొందరు కాపు నేతలు సమావేశమై దీనిపై చర్చించడం, ఆ సమావేశంలో ముఖ్యమైన కాపు నేతలు లేకపోవడంతో.. ఈ పార్టీ వస్తుందా? లేదా అన్నది చర్చనీయాంశమైంది.

నిజానికి ఇలాంటి సమావేశాలు గతంలో జరిగాయి. అప్పట్లో ఈ సమావేశానికి వెళ్లిన వారిలో కొందరు.. ఈ మీటింగ్‌కు వెళ్లలేదు. దీంతో కాపుల కొత్త కాపురం కలహాలతో మొదలైందనే చర్చ నడుస్తోంది. కాపు సామాజికవర్గ పెద్దలు ఏర్పాటు చేస్తున్న కొత్త పార్టీ.. వెనుకబడిన వర్గాల కోసమే అంటున్నారు. కాపులతో పాటు వెనబడిన వర్గాలవారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యమని కొత్తపల్లవి వినిపిస్తున్నారు.

అయితే, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చేది ఔట్‌ డేటెడ్‌ నేతలకా అంటూ కొందరు కాపునేతలు డైరెక్టుగానే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, ప్రస్తుతం కాపు సామాజికవర్గంలో ఎక్కువ ఫాలోయింగ్‌ ఉన్న పవన్ కల్యాణ్, వంగవీటి రాధకు ఎందుకు నో ఎంట్రీ బోర్డు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అంటే, కాలం చెల్లిన నేతల కోసమే కొత్త పార్టీని తెరపైకి తెచ్చారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పైగా ఈ కాపు సమావేశం, కొత్త పార్టీ అనే ఆలోచన నుంచి కాపు మేధావి వర్గంలోని వాళ్లు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. మేధావి వర్గంలోని వాళ్లు ఇలా తప్పుకోడానికి కారణాలేంటనే దానిపైనా ఓ రీజన్ చెబుతున్నారు. ఓ మాజీ పోలీస్‌ అధికారి.. కాపు నేతల సంక్షేమం కోసం ఆప్‌తో కలసి ముందుకు వెళ్దామని ప్రతిపాదించినట్టు తెలిసింది.

అయితే, సదరు మాజీ పోలీస్ అధికారికి మద్దతిచ్చేందుకు నిరాకరించిన కొందరు కాపు నేతలు తదుపరి సమావేశానికి రాలేదని తెలుస్తోంది. ఇక మొదటి సమావేశానికి హాజరైన వంగవీటి రాధాను తరువాత సమావేశాలకు పిలవకపోవడం వెనక ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలపైనా, కాపు నేతల వైఖరిపైనా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

కాపు సామాజికవర్గం కోసం ప్రత్యేకంగా పార్టీ పెట్టడం, అందులో వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనే కాన్సెప్టు మొత్తం.. తాడేపల్లి నుంచి అందిన ఆదేశాల మేరకే అమలుపరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓవరాల్‌గా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి లాభించే విధంగా తెరవెనక వ్యూహరచన సాగుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. అసలు ఇలాంటి సమావేశాలకు పవన్ కల్యాణ్, వంగవీటి రాధని పక్కన పెట్టడంలో ఉన్న లోగుట్టుపై విస్తృత చర్చ జరుగుతోంది.

పవన్ కల్యాణ్, వంగవీటి రాధా.. జగన్‌కు బద్ద వ్యతిరేకులు కాబట్టే దూరం పెట్టారని చర్చించుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తే కాపు నేతల సమావేశం, పార్టీ పెట్టడం వెనక.. వైసీపీకి లాభం చేకూర్చి, టీడీపీ, జనసేనకు నష్టం చేకూర్చే వ్యూహం ఉందని చర్చించుకుంటున్నారు. టీడీపీలోని కీలక కాపు నేతలు.. వైసీపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story