Andhra Pradesh: జగన్ చెప్పినా అధికారులు తలకెక్కించుకోలేదు

Andhra Pradesh: జగన్ చెప్పినా అధికారులు తలకెక్కించుకోలేదు
"గుర్తుందా వర్షాకాలం" అంటూ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు సీఎం జగన్‌కు గుర్తు చేస్తున్నారు.

"జూలై 15 కల్లా రోడ్లపై గుంతలు వుండకూడదు"... ఇది గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్ అధికారులకు చేసిన సూచన.. ఏడాది గడిచింది, వానాకాలం ప్రారంభమైంది.. ఇప్పటికీ రోడ్లపై గుంతలు అలాగే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం చెప్పినా అధికారులు తలకెక్కించుకోలేదు. గుంతల రోడ్లపై తట్టెడు మట్టి కూడా పోయలేదు. దీంతో.. "గుర్తుందా వర్షాకాలం" అంటూ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు సీఎం జగన్‌కు గుర్తు చేస్తున్నారు. రహదారుల దుస్ధితి ఒక్కసారి తిలకించమంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా వరకు రోడ్లు స్విమ్మింగ్ పూల్స్‌ను తలపిస్తున్నాయి. గోతులమయంగా మారిన రహదారులు.. వర్షాలు కురవడంతో దారుణంగా తయారయ్యాయి. ఆ రోడ్లపై వాహనాలు ముందుకు కదిలించాలంటే అది ఒక సాహసమనే చెప్పాలి. ఈ రోడ్లపై గమ్యం చేరారంటే.. ఏదో సాధించినట్లే లెక్క.

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్లే ప్రధాన రహదారి పరిస్థితి చూస్తే.. బాబోయ్‌ అనాల్సిందే. ఇక్కడ రోడ్లను గుంతలు ఎలా కబళిస్తున్నాయో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. పెద్ద పెద్ద గోతులు.. చేరువులను తలపించే రహదారులు ఉసూరుమన్పిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా రావికమతం మెయిన్ రోడ్ కూడా దారుణానికి దగ్గరగా ఉంది. ఏళ్లుగా ఇక్కడ ప్రజలు రోడ్ల మరమ్మతుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ వీరిమాటను పట్టించుకోకపోవడంతో ప్రజలు ధర్నాలకు దిగుతూనే వున్నారు. రోడ్లు కొత్తగా వేయకపోయినా.. కనీసం మరమ్మతులు చేపట్టమని వేడుకుంటున్నారు.

చోడవరం ప్రధాన మార్గంలో వుండే రహదారి కూడా పూర్తిగా దెబ్బతింది. కంకరరాయి పొర కొట్టుకుపోయింది. ఈ మార్గంలో వెళ్లిన వారికి అక్కడక్కడా రోడ్డు కన్పిస్తుంది. ఎక్కడ చూసినా రోడ్డుకు బదులు గోతులు కన్పిస్తాయి. చోడవరం నుండి దాదాపు రోలుగుంట వరకు వెళ్లే మార్గం మొత్తం ఇదే తీరులో ఉంటుంది. దీంతో ప్రయాణికులకు నిత్యం నరకప్రాయమే అవుతోంది.

నాలుగేళ్లుగా రోడ్లు అధ్వానంగా వున్నా ప్రభుత్వ విప్ ధర్మశ్రీ కనెత్తి చూడలేదు. ఎంతోమంది ప్రయాణికులు కాళ్లు.. చేతులు.. విరగ్గొట్టుకున్నారు. తలలు పగలగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎదురుగా ఒక వాహనం వస్తూ గోతిలో దిగడం మొదలైందంటే.. అటువైపు వెళ్లే వాహనం ఆగాల్సిందే.. నీళ్లతో నిండిపోయిన గోతుల లోతు ఏ మేరకు వుందో ఊహించడం కష్టమే. ఇక రాత్రి వేళల్లో ప్రయాణాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోవాల్సిందే.

గాజువాక జగ్గు జంక్షన్‌లో దెబ్బతిన్న రోడ్లపై వెళ్తున్న వాహనాదారులను చూస్తే జాలి కలగకమానదు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో భారీ వాహనాల తాకిడి అధికమే.. దీంతో.. వాహనదారులకు ఆ రోడ్డుపై వెళ్లేలంటే కత్తి మీద సామే.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిస్ధితి మరీ దారణం. నాణ్యత లేని రోడ్లపై గిరిపుత్రుల ప్రయాణాలు ప్రాణాలతో చెలగాటమే. వీరి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలింది. కొత్తగా జిల్లా ఏర్పడినా రోడ్ల నిర్మాణం మాత్రం జరగలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాగా వున్నపుడు వేసిన రోడ్లు కొట్టకుపోయాక.. మళ్లీ వేయలేదు..అందుకు చింతపల్లి మండలం బలపం పంచాయతీ నిదర్శనం. లోతుగెడ్డ బ్రిడ్జి మీదుగా కోరుకొండ గ్రామం వరకు 18 కిలో మీటర్ల రోడ్డు గతంలో నిర్మించారు. కానీ చాలా వరకూ ఆ మార్గం దెబ్బతింది. ఈ రోడ్డు మీదుగా 37 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి దారిలో ప్రయాణం చేయాలంటే వాహన దారులు నరకం చూడవలసిన పరిస్థితి. ఎవరికి అనారోగ్యం చేసినా అంబులెన్స్ రావడానికి రోడ్డు ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ 18 కిలోమీటర్ల ప్రయాణానికి సుమారు గంట పైనే సమయం పడుతోంది. వర్షం పడితే రోడ్డు మీద గుంతలు నిండా నీరు నిండిపోవడం వల్ల ప్రమాదాలకు గురికావడం తప్పడం లేదని ఈ గ్రామాల గిరిజనలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక కోటగున్నలు నుండి సెరపల్లి మీదుగా రోడ్డు నిర్మాణం చేసి 2 ఏళ్లు పూర్తి కాలేదు. అప్పుడే రోడ్డు చెదరిపోయింది. అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి నాణ్యత లేని రోడ్లు వేశారనే ఆరోపణలున్నాయి.

జగనన్న పాలన మరికొద్ది నెలల్లో ముగియబోతోంది. ఏపీలో రహదారుల పునరుద్దరణకు ఇచ్చిన జూలై 15 గడువు కూడా ముగిసిపోయింది. ఇక ఎప్పుడు రోడ్లు వేస్తారు...ఎప్పటికి కష్టాలు తీరుతాయి? సీఎం డెడ్‌లైన్‌ పెట్టినా రోడ్లపై గుంతలు ఎందుకు పూడ్చలేదని జనం ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలు కనిపిస్తే చాలు.. నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story