Nara lokesh: మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్

శాసనసభలో ఏపీ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని లోకేశ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ లక్ష్యమని లోకేశ్ ప్రకటించారు. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయని గుర్తు చేశారు. ఈ పరిశ్రమలను ఆనాడు చొరవతో తీసుకొచ్చామని... అనేక సదస్సులు ఏర్పాటుచేసి విశాఖపై దృష్టిసారించామని వెల్లడించారు. ముందుచూపుతో ఆనాడు డేటా సెంటర్ పాలసీ తీసుకొచ్చి అదానీ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని... భూములు కేటాయించి శంకుస్థాపనలు చేస్తే జగన్ పాలనలో అదీ ఆగిపోయిందన్నారు. 2019-24 మధ్య ఒక్క కాంక్లేవ్ జరగలేదు.. ఒక్క పరిశ్రమ కూడా రాలేదని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
గుడ్డు వ్యాఖ్యలను గుర్తు చేసిన లోకేశ్
గతంలో హైదరాబాద్‌లో రేస్ జరిగింది. దీన్ని ఏపీలో ఎప్పుడు నిర్వహిస్తారని అడిగిన ప్రశ్నకు అప్పటి మంత్రి.. కోడి.. గుడ్డు పెట్టలేదని సమాధానమిచ్చారు. ఆరోజు నుంచి ఎక్కడికెళ్లినా ఐటీ మంత్రి ఇలా ఉంటారా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవమానం జరిగింది. ఇలా అయితే పరిశ్రమలు ఎలా వస్తాయన్నారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టాక పలు కంపెనీలను కలిస్తే గత ప్రభుత్వంలో వాళ్లు వాటాలడిగారని చెప్పారు. దీంతో పరిశ్రమలు వెళ్లిపోయాయని... ఐటీ కంపెనీల్లో కూడా వాటాలడిగే పరిస్థితి తెచ్చారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తామే ఐటీ సంస్థల వాళ్లందరితో సమావేశమయ్యామన్నారు. ఐటీ రంగంలో 20 శాతం మంది తెలుగువాళ్లు ఉండటం గర్వకారణమని నారా లోకేశ్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com