AndhraPradesh: పల్నాడులో కాల్పుల కలకలం..

పల్నాడులో దారుణం చోటుచోటుచేసుకుంది. అలవాలలో కాల్పుల మోతతో పల్నాడు ఉలిక్కిపడింది. రొంపిచర్ల టీడీపీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఆయన ఇంట్లోకి చొరబడిన ప్రత్యర్థులు నిద్రిస్తున్న బాలకోటిరెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో బాలకోటి రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హుటాహుటిన నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలకోటి రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాలకోటిరెడ్డి చికిత్స పొందుతున్న నరసరావుపేట ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. బాధితుడ్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము, టీడీపీ నేత చదవాడ అరవిందబాబు పరామర్శించారు. కాల్పులకు తెగబడింది వైసీపీ నేతలేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు పమ్మి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు, పూజల రాముడు హత్యకు యత్నించారని మండిపడ్డారు. గతంలో ఎంపీపీగా ఉన్న బాలకోటిరెడ్డిపై ఇటీవల దుండగులు కత్తులతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారు. అయితే ప్రాణాలతో బయటపడిన బాలికోటిరెడ్డిపై ఇపుడు మళ్లీ హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండుగులు. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమై ముందస్తుగా అలవాలలో భారీగా బలగాలను మోహరించారు. అటు బాలకోటిరెడ్డిపై కాల్పులకు తెగబడిన నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాల్పులకు పాల్పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com