AndhraPradesh : సీటు వద్దంటే వద్దు... పదవీ ముద్దులేదు....! వైసీపీ రివర్స్ రాజకీయం

AndhraPradesh : సీటు వద్దంటే వద్దు... పదవీ ముద్దులేదు....! వైసీపీ రివర్స్ రాజకీయం
నా కొద్దన్నా.... తప్పదన్నా....! వైసీపీలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం... చేతులెత్తేస్తున్న సీనియర్ నేతలు...

రాజకీయ నేతలకు పదవులంటే ఎంత ప్రీతో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇంతకాలం చేశాం కదా, ఇహ వేరేవాళ్లకు అవకాశం ఇద్దామంటే 'అమ్మో ససేమిరా' అంటారు. కానీ, ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు పదవులు వద్దు మహాప్రభో అని దండం పట్టేస్తున్నారట. ఇదే జగన్మోహనరెడ్డిగారి రివర్స్ పాలన రియాక్షన్.

వైసీపీ పాలనలో 3ఏళ్లు గడిచేసరికి జనంలో కి వెళ్లడానికే నేతలు భయపడుతున్నారు. పరిపాలించిన వారు, పరిపాలిస్తున్న వారు, పెత్తనం చేస్తున్నావారే కాడి కింద పడేస్తున్నారు.

ఏపీలో సాధారణ ఎన్నికలు 2024 ఏప్రిల్ లో జరగాల్సి ఉంది. అయితే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే అనుమానాలున్నాయి. 2023 బడ్జెట్ లో ఉన్నవీ లేనివీ చూపించేసి ఆపై అసెంబ్లీని రద్దు చేస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల ప్రధాని ముందు తన మనోగతాన్ని బయటపెట్టారని తెలుస్తోంది.

ఇక ఎన్నికలు 2023లో వచ్చినా 2024లో వచ్చినా గెలుపు కష్టమేనన్న విషయం ఎమ్మెల్యేలకు బోధపడింది. ఏ ముహూర్తాన జగన్ గడప గడపకూ వెళ్ళమన్నారో కాని.. అదే వైసీపీ ఎమ్మెల్యేకు జ్ఞాన కేంద్రమైంది. ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో ప్రత్యక్షంగా చూస్తున్నారు. దీంతో మరోసారి జనం వద్దకు వెళ్లి ఓట్లు అడగలేమన్న నిర్ణయానికి వచ్చేశారు.


ముఖ్యంగా సీనియర్ నేతలు ఈ వరుసలో ముందున్నారు. జగన్ విచిత్ర పాలన చూసి తట్టుకోలేక ఈ నిర్ణయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం వారిని బుజ్జగించి మరీ పోటీ చేయించాలనే ప్రయత్నాల్లో ఉన్నారట.

ఉత్తరాంధ్రలో పేరున్న నాయకుల్లో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. వీరిద్దరూ ప్రస్తుతం జగన్ సర్కారులో అమాత్యులే. వచ్చే ఎన్నికల్లో పోటీకి తాము దూరంగా ఉంటామని ఇప్పటికే ఇరువురూ జగన్ కు చెప్పేశారట. పేరుకు సీనియర్లే అయినా మునుపటిలా తమ ప్రాంతంలో చక్రం కాదు కదా, కనీసం వేలు కూడా తిప్పలేని పరిస్థితికి చేరుకున్నారు. మూడేళ్ల కాలంలో జగన్ విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్రను రాసిచ్చేశారన్న ముచ్చట తెలిసిందే. దీంతో పేరుకు తప్ప బొత్స, ధర్మాన హవా సాగడంలేదనే చెప్పాలి. మూడేళ్లుగా జిల్లా, నియోజకవర్గం స్థాయిలో చేసిందేమీ లేదనే భావన కలగడంతో మరోసారి జనాల్లోకి వెళ్లి ఒట్లడగలేమనే నిర్ణయానికొచ్చారట. జగన్ మాత్రం వీరిద్దరినీ మళ్లీ పోటీచేయాల్సిందిగా అడిగారట.

మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానిది మరో స్టైల్. ఎవరు మైకు పెట్టినా ఈసారి తాను పోటీచేయననే దండకం మొదలు పెట్టేస్తున్నారు. తన కుమారుడు పోటీ చేస్తాడంటూ కొత్త పాట అందుకుంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నాని, జగన్ సూచనలతో పవన్ కల్యాణ్ పై మాటలతూటాలతో చెలరేగిపోయారు. కానీ, ఇప్పుడు అదే బ్యాక్ ఫైర్ అయింది. పవర్ స్టార్ ను తమ ప్రతినిధిగా భావిస్తున్న కాపు సామాజిక వర్గం ఇప్పుడు నానీపై గుర్రుగా ఉంది. దీంతో ఈసారి మచలీపట్నంలో తన గెలుపు కష్టమేనని నాని ఫిక్స్ అయిపోయారు.

ఇక కరుణాకరరెడ్డిది విభిన్నమైన రాజకీయం. ఆయన స్వతహాగా అభ్యుదయ వాది. 2019 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన కరుణాకర్ ను ఆ తరువాత పక్కన పెట్టేశారు. మంత్రి పదవి కాదు కదా కనీస స్థాయిలో కూడా ఆయనకు పార్టీలో గౌరవం దక్కలేదు. పార్టీ పోకడల పట్ల తీవ్ర అసంతృప్తి, అర్బన్ ప్రాంతమైన తిరుపతి వైసీపీకి కలసిరాదు అన్న అంశాలు దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. భూమన కూడా ఈసారి తాను పోటీ చేయలేనంటూ సీఎం వద్ద తన అశక్తతతను వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది.

డోన్ లో ఉన్న ప్రతికూల వాతావరణంతో ఆర్ధిక మంత్రి బుగ్గన కూడా హ్యాండ్సప్ అంటున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచిన ఆయన వచ్చే ఎన్నికల్లో తనకు విశ్రాంతి ఇవ్వమంటున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కేశవరెడ్డి కూడా నావల్ల కాదు మా అబ్బాయిని దింపేస్తాను అంటున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన వారసుడికి టిక్కెట్టు అడుగుతున్నారు. గుంటూరు లో ముస్తఫా కూడా ఈసారి పోటీకి విముఖంగా ఉన్నారు.. అయితే అధినేత జగన్ మాత్రం వీళ్ళే పోటీచేయాలని పట్టుబడుతున్నారట. ఇంతటి ఉద్దండులే కాదంటే వారి వారసులైనా, వేరే వాళ్లైనా అసలు తట్టుకోలేరన్నది జగన్ భయం.

ప్రస్తుతం బయటపడ్డ జాబితా ఇదే. అయినా రాబోయే రోజుల్లో జనంలోకి వెళ్లే ధైర్యం ఎంత మంది చేస్తారో చూడాలి. 'సర్వే చేయిస్తాను, మంచి మార్కులు వస్తేనే సీట్లిస్తాను' అంటోన్న జగన్ స్వచ్ఛందంగా తప్పుకుంటా మంటే మాత్రం కాదంటున్నారంటే... ఇది బలమా ? బలహీనతా ? అర్దంకావడం లేదా ?


రావిపాటి

Tags

Read MoreRead Less
Next Story