AndhraPradesh: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

AndhraPradesh: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్
శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం

టీడీపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టుతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఆళ్ళగడ్డలోని భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌ రెడ్డి అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని మాజీ మంత్రి సవాల్ చేశారు.ఈ నేపధ్యంలో అఖిలప్రియను నంద్యాల వెళ్లకుండా ఆళ్ళగడ్డలోనే పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు.అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని భూమా అఖిలప్రియ పీఏకి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మరోవైపు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే చూపు టీడీపీ వైపు ఉందంటూ రెండు రోజుల క్రితం భూమా అఖిలప్రియ అనడం సంచలనం రేపుతోంది. శిల్పారవి టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నారని తెలిసిందని టీడీపీలో చేరేందుకు ప్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. శిల్పా రవి అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానంటూ భూమా అఖిలప్రియ సవాల్ విసిరారు.తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలని, లేదంటూ క్షమాపణ చెప్పాలంటూ అఖిలప్రియ డిమాండ్ చేశారు. భూమా అఖిలప్రియ సవాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రిని నంద్యాలకు రానీయకుండా ఆళ్లగడ్డలో హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Next Story