Andhra Pradesh : ఏపీలో మరో 15 రోజులు పరిశ్రమలకు విద్యుత్ కోతలు

Andhra Pradesh : ఏపీలో కరెంట్ కోతలు ఆగలేదు. పూర్తిస్థాయి విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న జగన్ ప్రభుత్వం.. పవర్ హాలిడేను మరిన్ని రోజులు పొడిగించింది. ఓవారం పది రోజుల పాటు కరెంట్ కోతలు ఉంటాయ్ సర్దుకుపోండన్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడా కోతలను మరింత పెంచింది. మరో 15 రోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఉంటాయని చెబుతోంది. ఏపీలో విద్యుత్ పంపిణీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారేలా ఉండటంతో పవర్ హాలిడేను కొనసాగించాలని డిస్కంలు నిర్ణయించాయి. పవర్ హాలిడే కారణంగా ఇప్పటికే పరిశ్రమలపైనా, కార్మికులపైనా తీవ్ర ప్రభావం పడుతోందని ఏపీ పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా సతమతం అవుతున్న పరిశ్రమలు.. మరింత ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతాయని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిశ్రమలపై పవర్ హాలిడే భారీ ప్రభావం చూపుతోంది. ఉత్పత్తి పెంచుకోవడానికి సిద్ధమవుతున్న సమయంలో విద్యుత్ విరామం ఇవ్వడంతో ఏపీలో పరిశ్రమల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. అంతరాయం లేకుండా 24 గంటలు పని చేసే పరిశ్రమలు కూడా 50 శాతం విద్యుత్తే వాడుకోవాలని డిస్కంలు ఆంక్షలు విధించాయి. షిఫ్టుల వారీగా పనిచేసే పరిశ్రమలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య ఒకే షిఫ్టు కింద పని చేయాలంటూ నిబంధనలు పెట్టడంపై పారిశ్రామిక వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే డిస్కంలు పెట్టిన ఆంక్షల వల్ల ఫెర్రో అల్లాయిస్, టెక్స్‌టైల్, సిమెంట్, స్టీలు పరిశ్రమల ఉత్పత్తి దెబ్బతిందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దేశిత వ్యవధిలో ఆర్డర్లు అందించడం సాధ్యం కావటం లేదంటున్నారు.
ఎండాకాలం విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటుందని తెలిసి కూడా జగన్ ప్రభుత్వం అప్రమత్తం అవ్వలేదు. ఇళ్లకు కరెంట్ ఇవ్వడం కోసం పరిశ్రమలకు కోత పెడతామని డిస్కంలు ప్రకటించాయి. ఏప్రిల్ 8న మొదలైన ఈ పవర్ హాలిడే.. ఏప్రిల్ 22 వరకు కొనసాగుతుందని, ఆ తరువాత అంతా సర్దుబాటు అవుతుందని డిస్కంలు చెప్పుకొచ్చాయి. ఇప్పటికీ సమస్యను పరిష్కరించుకోలేక పోవడంతో నెలాఖరు వరకు పవర్ హాలిడే పొడిగించారు. అయినా సరే సరఫరా మెరుగుపడకపోగా గృహ వినియోగం పెరగడంతో.. సర్దుబాటు కోసం పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని మరో 15 రోజులు పొడిగించడానికి డిస్కంలు ఈఆర్సీని అనుమతి కోరాయి. ఈఆర్సీ ఆమోదించడంతో 15 రోజుల పాటు పవర్ హాలిడే కొనసాగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com