విశాఖ స్టీల్‌ ఆస్తుల అమ్మకాలపై.. కేంద్రం మరో అడుగు

విశాఖ స్టీల్‌ ఆస్తుల అమ్మకాలపై.. కేంద్రం మరో అడుగు
విశాఖపట్నం హెచ్‌బీ కాలనీలో 22.90 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను అమ్మాలని నిర్ణయించింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆస్తుల అమ్మకానికి రంగం సిద్ధంమైది. విశాఖపట్నం హెచ్‌బీ కాలనీలో 22.90 ఎకరాల్లో ఉన్న 588 క్వార్టర్లను అమ్మాలని నిర్ణయించింది. అటు ఆటోనగర్‌లోని 2 ఎకరాల పరిధిలో ఉన్న 76 ఇళ్లు, పెదగంట్యాడలోని 434.75 చదరపు గజాల్లో ఉన్న 8 ఇళ్లను అమ్మకానికి పెట్టింది. ఈ మేరకు ఉక్కునగరం పరిపాలన విభాగం ప్రకటన జారీచేశారు. విశాఖలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ఈ మేరకు ఆసక్తి తెలపాలని కోరుతూ లేఖలను విడుదల చేశారు. ఈ ఆస్తులను ఏకమొత్తంగా లేదా విడివిడిగా కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించారు. ఆస్తుల కొనుగోలు విషయంలో ఆసక్తి తెలిపేందుకు 10 రోజుల గడువు ప్రకటించారు. నగరం నడిబొడ్డులో ఉన్న హెచ్‌బీ కాలనీలో అమ్మకానికి పెట్టిన 22.90 ఎకరాల స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.1,500 కోట్ల పైమాటే. ఆటోనగర్‌లోని రెండు ఎకరాలు వంద కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

ఉక్కు స్థలాలు అమ్మకాలపై మండిపడతున్నాయి కార్మికసంఘాలు. ఇలా అమ్మితే వచ్చే డబ్బుతో ఇప్పటికిప్పుడు ప్లాంటు అవసరాలు తీరుతాయని, ఆ తర్వాత పరిస్థితి ఏంటనే ప్రశ్నిస్తున్నారు. ఉక్కు ఆస్తులను తక్కువ ధరలకు కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు కార్మికులు. విశాఖలో విలువైన ఉక్కు ఆస్తులను కేంద్రమే ఆధీనంలో పెట్టుకుని సున్నావడ్డీకి రుణసాయం చేస్తే ప్లాంటు నిలదొక్కుకునే అవకాశం ఉందంటున్నారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకొనే విషయంలో జగన్‌ సర్కారు తీవ్ర నిర్లిప్తత ప్రదర్శిస్తోంది. విశాఖపై ఎనలేని ప్రేమ ఒలకబోసే సీఎం జగన్‌ తరచూ కేంద్ర పెద్దలను కలుస్తున్నా.. వారివద్ద స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించిన దాఖలాల్లేవు. విశాఖ నగర కార్పొరేషన్‌, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పాదయాత్రలు, కేంద్ర పెద్దలకు లేఖలు రాసి హడావుడి చేసిన వైసీపీ ముఖ్యనేతలు.. ఆ తర్వాత ఏనాడూ గట్టిగా నిలదీయలేదు. అదే ఈ పరిస్థితికి దారితీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి

Tags

Read MoreRead Less
Next Story