AP : సీపీఎస్ ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసగిస్తోందా..?!
సీపీఎస్ ఉద్యోగులను అన్నిరకాలుగా జగన్ ప్రభుత్వం మోసగిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సీపీఎస్ రద్దుపై మడం తిప్పేసింది. ఇప్పుడు ఉద్యోగుల జీతంలో మినహాయించిన వాటాతోపాటు, తన వాటా కూడా వేయకుండా వారిని గందరగోళానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో 1.94 లక్షలమంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు.మరోవైపు వారి జీతాల నుంచి మినహాయించిన డబ్బులనూ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేస్తోంది. ప్రభుత్వం ప్రతి నెలా సీపీఎస్ ఉద్యోగుల జీతంలో 10 శాతం సీపీఎస్‌ను మినహాయిస్తోంది. దీనికి ప్రభుత్వ వాటా మరో 10 శాతం కలిపి మొత్తాన్ని ఉద్యోగుల ప్రాన్ అకౌంటల్లో జమ చేయాలి. కానీ అలాంటిది జగరకపోగా మొత్తం నిధులను కూడా వాడేకుంది సర్కార్.
మరోవైపు ప్రతి నెలా ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ దాదాపు120 కోట్లు కాగా.. ప్రభుత్వ వాటా మరో 120 కోట్లు ఉంటుంది. తన వాటా సొమ్ము జమచేయకపోగా ప్రభుత్వం 11 నెలలకు కలిపి ఉద్యోగుల వాటానే 1 వేయి 320 కోట్లు వాడేసుకుంది.రెండు వాటాలు కలిపితే 2వేల640 కోట్లు ప్రభుత్వం ప్రాన్ ఖాతాలకు చెల్లించాల్సి ఉందని, ఎప్పుడు జమ చేస్తుందో తెలియడం లేదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వీరికి నగదు రూపంలో ఇవ్వాల్సిన డీఏ బకాయిలూ చెల్లించడం లేదు. బకాయిలు ఇవ్వకుండానే వారి నుంచి ఆదాయపు పన్ను మినహాయించేశారు. పీఆర్సీ కంటే ముందు ఇవ్వాల్సిన డీఏ బకాయిలే 960 కోట్ల వరకు ఉన్నాయి. వీటిలో 90 శాతాన్ని ఉద్యోగులకు నగదుగా ఇవ్వాలి. మరో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయాలి. సీపీఎస్ రద్దు చేస్తారనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు తమ సొమ్మునూ ఇతర అవసరాలకు మళ్లించేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలతో తమ పదవీవిరమణ ప్రయోజనాలనూ నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు.
ఇక కేంద్ర మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ విధానం అమలు చేస్తున్నామని రాష్ట్రాలు చెబుతున్నాయి. మరి ఈ పెన్షన్ విధానం సక్రమంగా అమలు చేయని రాష్ట్రాలను ప్రశ్నించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఉద్యోగులు నిలదీస్తున్నారు. సీపీఎస్ విధానం ప్రకారం... తన వాటాను ప్రభుత్వం సకాలంలో జమ చేయకపోతే.. ఆ కాలానికి వడ్డీ కలిపి జమ చేయాలి. దీంతో వడ్డీతో సహా జమ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్రం తన వాటాను ఇప్పుడు 14 శాతానికి పెంచింది. పలు రాష్ర్టాలు కూడా ఇదే బాటలో తమ వాటాను పెంచాయి. కానీ, జగన్ సర్కారు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మండి పడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com