AP: స్పీకర్ తమ్మినేనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు

AP: స్పీకర్ తమ్మినేనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు
తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్‌ తీసుకున్నారని కూన రవికుమార్‌ ఆరోపణ

స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేత కూన రవికుమార్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. తమ్మినేని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో మూడేళ్ల లా కోర్సులో అడ్మిషన్‌ తీసుకున్నారని ఆరోపించారు. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రపతితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, సీఎం జగన్‌లకు ఈ మేరకు లేఖలు రాశారు. తమ్మినేని సీతారాం స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఉన్న మహాత్మాగాంధీ లా కాలేజీలో... 2019-20 విద్యా సంవత్సరంలో మూడేళ్ల లా కోర్సులో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్‌ తీసుకున్నారని ఆరోపించారు. అది ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధ కళాశాల. నిబంధనల ప్రకారం మూడేళ్ల లా కోర్సులో చేరాలంటే డిగ్రీ లేదా దానికి సమానమైన కోర్సును పూర్తి చేసి ఉండాలి. సీతారాం గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయలేదు. ఆ విషయాన్ని గతంలో ఆయన స్వయంగా చెప్పారని కూన రవికుమార్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story