AP : మహిళలపై మంత్రి ధర్మాన అభ్యంతరకర వ్యాఖ్యలు

రెండు రోజుల క్రితం మగవాళ్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.... ఇప్పుడు మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పథకాలకు జగన్ ఇంట్లోంచి డబ్బు ఇస్తున్నారా అని కొంతమంది మహిళలు మాట్లాడుతున్నారని.. ఎవరైనా ఇంట్లోంచి ఇస్తామంటే వారి ఇంటికే వెళ్దామంటూ కామెంట్స్ చేశారు. అంతే కాదు... తిన్నది తిరగబోసుకోవడం అంటే ఇదేనన్నారు. సంస్కారం లేకపోతే ఎలా? ఏం మనుషులో ఏంటో.. పద్దుకు మాలిన వ్యక్తుల్లా మాట్లాడితే ఎలా’ అంటు మహిళలపై మండిపడ్డారు. శ్రీకాకుళంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. పథకాలు, డబ్బులు తీసుకుని సంస్కారవంతమైన మాట రాకపోతే ఎలా అంటూ తన అసహనాన్నంతా వెళ్లగక్కారు.
ఓ వైపు మంత్రి ప్రసంగిస్తుండగా బయటకు వెళ్లే ప్రయత్నం చేశారు కొందరు మహిళలు. దీంతో స్పందించిన మంత్రి.... వారిని ఆపేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఐదు నిమిషాల్లో సమావేశం ముగుస్తుందని.. కాసేపు ఆగి వెళ్లండంటూ మహిళల్ని వేడుకున్నారు. అయినా.. మహిళలు ఎవరూ మంత్రి మాటల్ని లెక్కపెట్టలేదు. మహిళలు మధ్యలో వెళ్లకుండా విశ్వప్రయత్నాలు చేశారు అధికారులు. సమావేశం ముగిసేవరకు స్కూల్ గేటుకు తాళం వేశారు. అయితే... అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సిన మహిళలు ఎత్తైన గోడ ఎక్కి బయటకు దూకారు. అధికారులకు శాపనార్థాలు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com