AP : కాణిపాకంలో అపచారం... గర్భగుడిలో వైసీపీ నేత ఫొటోలు

AP : కాణిపాకంలో అపచారం... గర్భగుడిలో వైసీపీ నేత ఫొటోలు
X
ఆలయంలో సెల్‌ఫోన్లు, మూలవిరాట్‌ ఫొటో తీయడం నిషేధం అమలులో ఉన్నా ఫొటోలు తీశారు

ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో వైసీపీ నేత అపచార పర్వానికి తెరలేపారు. ఆలయ నిబంధనలకు మంట గలిపారు. ఆలయంలో సెల్‌ఫోన్లు, మూలవిరాట్‌ ఫొటో తీయడం నిషేధం అమలులో ఉన్నా ఫొటోలు తీశారు. స్వామివారిని దర్శించుకున్న వైసీపీ నేత బాలవెంకటరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా మూలవిరాట్ విగ్రహాన్ని ఫొటోలు తీశారు. అంతేకాకుండా.. తన ఫొటోలను ఫేస్‌బుక్‌లోను పెట్టారు. వరసిద్ధి గర్భాలయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. మరోసారి అధికారుల నిఘా వైఫల్యం బయటపడింది.

అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌, వైసీపీ నేత వెంకటరెడ్డి ఇటీవల కుటుంబ సమేతంగా కాణిపాకం వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఆయన సతీమణితో కలిసి గర్భగుడిలో స్వామిని దర్శించుకునే సమయంలో మూలవిరాట్‌ కనిపించేలా ఫొటోలు తీశారు. ఇలా.. మూలవిరాట్‌ను దర్శించుకునేటప్పుడు, ప్రాంగణంలో అర్చకుల ఆశీర్వాదం తీసుకునేటప్పుడు తీసిన 8 ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి మరో 8 మందికి ట్యాగ్‌ కూడా చేశారు. దాంతో ఆ పోస్టు వైరల్‌ అయింది. తర్వాత ఆ పోస్టును తొలగించినా ఫొటోలు మాత్రం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్వామివారి మూలవిరాట్‌ ఫొటోలను తీయడాన్ని దశాబ్దాల కిందటే కాణిపాకంలో నిషేధించారు. నేరంగా పరిగణిస్తారు కూడా. దర్శనానికి వెళ్లేవారంతా ఆలయం బయట రాజగోపురం వద్ద కౌంటరులో సెల్‌ఫోన్లను అప్పగించాలి. మరీ.. ప్రముఖులైతే ఫోను స్విచ్‌ఆఫ్‌ చేసుకుని జేబులో పెట్టుకుంటారు. ఆలయంలో బయటకు తీయరు. కానీ.. ఈ వైసీపీ నాయకుడి ఫోన్‌ను సెక్యూరిటీ సిబ్బంది ఎలా అనుమతించారు? మూలవిరాట్‌ ఫొటోలు తీస్తుంటే అర్చక సిబ్బంది ఎందుకు అడ్డుకోలేదు? అనేది చర్చనీయాంశమైంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ నేత, అధికారులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story