AP: అమరావతిలో 144 సెక్షన్ .. ఏం జరుగుతుందోనని ఉత్కంఠ

అమరావతిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ పెరిగింది.సవాళ్లు..ప్రతి సవాళ్ల మధ్య అమరావతిలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.పల్నాడు జిల్లా అమరావతిలో అధికార, ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు సై అంటే సై అంటున్నాయి. ఇవాళ అమరలింగేశ్వరుని సన్నిధిలో బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు. దీంతో అమరావతిలో ఏంజరగబోతుంది అనేది పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఇరు పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో అప్రమత్తమైన పోలీసులు అమరావతిలో 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతల కోసం పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ అమరావతిలో ఉన్నారన్న సమాచారంతో..ముస్లిం కాలనీలో సెర్చింగ్ చేపట్టారు.
అమరావతి వద్ద కృష్ణా నది నీటి గుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలతో రాజకీయ రగడ మొదలైంది. ఇసుక తవ్వకాలపై వైసీపీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాల్ విసురుకున్నారు. వీరిద్దరూ పరస్పరం వేసుకున్న సెటైర్లు, పోస్టర్లు సోషల్ మీడియాలోను తెగ వైరల్‌గా మారాయి. ఇసుకు తవ్వకాల్లో తన ప్రమేయాన్ని నిరూపించాలని వైసీపీ ఎమ్మెల్యే సవాల్ స్వీకరించిన కొమ్మలపాటి... ఇందుకోసం రెడీ అయ్యారు. అమరావతి ఆలయంలో ఎమ్మెల్యే అక్రమాలు నిరూపించేందుకు సై అంటున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు ఇప్పటికే అమరావతికి చేరుకుంటున్నారు.
ఇరుపార్టీల బహిరంగ చర్చ నేపథ్యంలో అమరావతిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అమరావతి వెళ్లే నాలుగు వైపులా బ్యారికేడ్లు ఏర్పాట్లు చేశారు. హౌస్ అరెస్టు అనుమానంతో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, శ్రేణులు ముందస్తుగానే ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. దాంతో ఇవాళ అమరావతిలో బహిరంగ చర్చ ఎలా ఉండబోతోంది? అనేది చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com