AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు కారణం ఆ వ్యక్తేనా..?

AP 3 Capitals Bill: మూడు రాజధానులపై జగన్ సర్కార్ ఎందుకు వెనక్కి తగ్గింది? రెండేళ్లుగా మూడు రాజధానులపై తగ్గేదే లేదు అంటున్న జగన్ సడన్‌గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దీనిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. మూడు రాజధానులపై జగన్ వెనకడుగు వేయడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు.
అందులో ఒకటి.. అమరావతి రైతుల ఉద్యమం ఉధృతంగా సాగుతుండడం. 700 రోజులకు పైగా పోరాడుతున్న మహిళలు, రైతులు.. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర చేస్తున్నారు. జిల్లా దాటిన తరువాత అనూహ్య స్పందన వచ్చింది. స్వతహాగా గుంటూరు జిల్లాలో ఉండే ఆదరణ ఎలాగూ ఉంది. ఎప్పుడైతే గుంటూరు దాటి ప్రకాశంలో అడుగుపెట్టారో.. అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
నెల్లూరు జిల్లాలో సైతం ఊహించని విధంగా అమరావతి రైతులకు మద్దతు వస్తోంది. దీంతో ప్రభుత్వంలో భయం మొదలైనట్టు చెబుతున్నారు. అమిత్ షా ఎఫెక్ట్ బాగా పడినట్టు తెలుస్తోంది. అమరావతి ఉద్యమం పెయిడ్ ఆర్టిస్టుల పోరాటం అని, టీడీపీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని రాష్ట్ర బీజేపీ నేతలు అమిత్ షాకు చెప్పారు. ఈ మాటలు వింటూనే విరుచుకుపడ్డారు అమిత్ షా.
అమరావతి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, వెంటనే రైతులకు మద్దతు ఇవ్వాలని అల్టిమేట్టం జారీ చేశారు. అమిత్ షా తిరుపతి వచ్చినప్పుడు.. ఇంటెలిజెన్స్ వర్గాలు కొన్ని రిపోర్టులు ఇచ్చాయి. అమరావతి రైతుల ఉద్యమం కారణంగా టీడీపీ బలపడుతోందనేది దాని సారాంశంగా చెబుతున్నారు. అందులో భాగంగానే అమరావతికి మద్దతు తెలపాలని రాష్ట్ర బీజేపీ నేతలకు అమిత్ షా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
సాక్షాత్తు అమిత్ షానే అమరావతికి మద్దతు ఇచ్చినప్పుడు ఇక జగన్ వెనకడుగు వేయకతప్పలేదనే వాదన వినిపిస్తోంది. మూడు రాజధానులపై జగన్ ఉన్నట్టుండి వెనక్కి తగ్గడానికి కారణం.. ఢిల్లీ నుంచి వచ్చిన ఒత్తిడే అన్నది మరో వాదన. అమరావతి ఉద్యమం బలపడుతోందన్న నివేదిక ఢిల్లీకి సైతం చేరడంతో.. జగన్‌కు ఫోన్ చేసి మరీ సున్నితంగా హెచ్చరించినట్టు చెబుతున్నారు.
పైగా ఈ విషయంపై ఢిల్లీ నుంచి రెండుసార్లు ఫోన్ రావడంతో.. తప్పని పరిస్ధితుల్లోనే మూడు రాజధానులపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై వెనక్కి వెళ్లడానికి జగన్‌కు ఇష్టం లేకపోయినా.. సాక్షాత్తూ ఢిల్లీ పెద్దలే స్వయంగా ఫోన్ చేసి చెప్పడంతో వెనకడుగు వేయక తప్పలేదని చర్చించుకుంటున్నారు. ఇక మూడో కారణం.. కోర్టులో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉండడం. ప్రస్తుతం అమరావతిపై కోర్టులో రోజువారీ విచారణ జరుగుతోంది.
ఈ విచారణలో చీఫ్ జస్టిస్ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ప్రభుత్వం కనిపించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చేస్తూ తీసుకొచ్చిన చట్టాల్లో చాలా సాంకేతిక సమస్యలున్నాయని ప్రభుత్వానికో స్పష్టత వచ్చింది. దీంతో కోర్టులో ఈ చట్టం నిలబడలేదని గ్రహించే.. అత్యవసర మంత్రివర్గ సమావేశం పెట్టి మరీ మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com