AP: బిడ్డల సదువుకోసం 4 కిలోమీటర్ల రోడ్డు వేసిన గోండ్లు

AP: బిడ్డల సదువుకోసం 4 కిలోమీటర్ల రోడ్డు వేసిన గోండ్లు
ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా లాభం లేకపోవడంతో గ్రామస్థులే దారి వేసుకున్నారు

తమ చిన్నారులు చదువుకుని, వృద్ధిలోకి రావాలన్నదే వారి అభిమతం... ప్రభుత్వం కనికరించకపోయినాా, అధికారులు అక్కరకు రాకపోయినా వారి సంకల్పం మాత్రం చెదిరిపోలేదు. అందుకే నడుం బిగించారు... నాగలి పట్టారు... తమ పిల్లల భవిష్యత్తుకు స్వయంగా తామే బంగారు బాట వేసుకున్నారు.



ఆంధ్రప్రదేశ్ లోని మన్యంలో గ్రామస్థులు తమ ఊరి పిలల్లు పాఠశాలలకు వెళ్లేందుకు స్వయగా వారే రహదారి నిర్మించుకున్నారు. గ్రామస్థులంతా ఏకమై కేవలం మూడు రోజుల్లోనే రహదారిని నిర్మించుకున్న వైనం ప్రస్తుతం జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకట్టుకుంటోంది.



అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రవిక మఠం మండలం చీమలపాడు గ్రామపంచాయతికి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిన్న మారుమూల కుగ్రామం నేరేడు బండ. గ్రామంలో గోండు జాతికి చెందిన 12 కుటుంబాలు నివశిస్తున్నాయి. అక్కడ ఉన్న 15 మంది పిల్లలు చదువుకోవడానికి ఆ గ్రామం నుంచి 4కిలో మీటర్ల దూరంలో ఉన్న జోగం పేటలోని మండల పరిషత్‌ పాఠశాలకు వెళుతుండేవారు.



వారు వెళ్లే దారి బ్రిటీష్‌కాలంలో పేపర్‌ తయారికోసం వెదురు కర్రలను సరఫరా చేయడానికి వేశారు. కాలక్రమేణా అది పూర్తిగా ధ్వంసమైంది. దీంతో నేరేడుబండ గ్రామ చిన్నారులు బడికి పోయేందుకు రోజూ 4కిలోమీటర్లు కొండదిగి వెళ్లాల్సి వచ్చేది. ముళ్లతో, పొదలతో నిండి ఉన్న దారి పెద్దల సహనానికే పరీక్షలాంటిది. అలాంటి దారిన పసిపిల్లలు అష్టకష్టాలూ పడి స్కూలుకు వెళుతుంటే ఆ తల్లిదండ్రుల కంట రక్తకన్నీరు వచ్చేది. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినా లాభం లేకపోయింది. ఎండిపీఓకు చాలా సార్లు వారి సమస్యను విన్నవించుకున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా... ఇహనో ఇప్పుడో చేసేస్తాం అన్నవారే తప్ప ఒక్కరూ సరైన రీతిన స్పందించింది లేదు. దీంతో తమ తలరాతను తామే మార్చుకునేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు.



ఇక ప్రభుత్వం, అధికారులు మాటలతో మభ్యపెట్టడం తప్ప తమను ఉద్దరించేది లేదు అని భావించిన గ్రామస్థులు బ్రిటీష్ కాలం నాటి రోడ్డును తామే బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పిల్లాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ నడుంబిగించి కేవలం మూడురోజుల్లోనే రోడ్డు మార్గాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు నేరేడు బండ చిన్నారులు ఆడుతూపాడుతూ బడికిపోతున్నారు. తమ కోసం గ్రామం మొత్తం ఏకతాటి పైకి వచ్చిన వైనం వారికి మరింత స్ఫూర్తి ఇస్తుంది అనడంలో సందేహమే లేదు.



Tags

Read MoreRead Less
Next Story