AP : చిట్టితల్లులకు తీరని క్షోభ.. కౌమారం తీరకుండానే తల్లులవుతున్న చిన్నారులు

ఆంధ్రప్రదేశ్
AP : చిట్టితల్లులకు తీరని క్షోభ.. కౌమారం తీరకుండానే తల్లులవుతున్న  చిన్నారులు
ఏపీలో జోరుగా బాల్యవివాహాలు; 10లో 8మంది కౌమార దశలోనే గర్భం దాల్చుతున్న వైనం; క్రైం నివేదికలో విస్తుపోయే వాస్తవాలు

Andhra Pradesh: అమూల్యమైన బాల్యాన్ని కాపాడేందుకు ఓ వైపు స్వచ్ఛంద సంస్థలూ, మరోవైపు ప్రభుత్వం ఎంతగా కృష్టి చేస్తున్నా బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. ఏ చీకూ చింతా లేకుండా హాయిగా గెంతులేయాల్సిన వయసులో మెడలో ఉరితాడు లాంటి పసుపు తాడుతో అత్తవారింట అడుగుపెడుతున్న చిన్నారులు నెలలు తిరగకుండానే అమ్మతనంలోకి అడుగుపెడుతున్నారు. తమ అచ్చటా ముచ్చటా తీరక ముందే తల్లిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమైపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బాల్యవివాహం చేసుకున్న ప్రతి పది మంది బాలికల్లో 8 మంది గర్భం దాల్చుతున్నారని చైల్డ్ రైట్స్ అండ్ యూ అనే సంస్థ ఓ నివేదిక వెల్లడించింది.



మైనారిటీ తీరకుండానే గర్భం దాల్చుతున్న బాలికలపై వివిధ రాష్ట్రాల్లో చైల్డ్ రైట్స్ అండ్ యూ సంస్థ నిర్వహించిన పరిశోధనలో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా 78% మంది మైనర్ వివాహితలు గర్భం దాల్చారని నివేదిక స్పష్టం చేస్తోంది. ఆ తరువాతి స్థానాల్లో ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్ర ఉన్నాయి. టీనేేజ్ ప్రెగ్నెన్సీ వల్ల అమ్మాయిల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపింది.



ఇక వివాహం జరిగిన వెంటనే అమ్మాయిలు గర్భం దాల్చే ప్రక్రియను 52శాతం మంది తల్లిదండ్రులు సైతం సమర్ధిస్తున్నారని, ఇది సంప్రదాయబద్ధమని వారు భావిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. కేవలం 22శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే టీనేజీ ప్రెగ్నెన్సీ పై అవగాహన కలిగి ఉన్నారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 10 జిల్లాల్లో బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలపై నిర్వహించిన రీసెర్చ్ లో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి.



NFHS-4(2015-16) నివేదిక ప్రకారం 15-19 మధ్య వయస్సు ఉన్న చిన్నారుల్లో 11.8శాతం మంది ఇప్పటికే తల్లులు అవ్వగా NFHS-5(2019-21) నివేదికలో అది 12.6శాతానికి చేరుకుంది. ఇక మైనర్ గర్భిణుల ప్రసవాల్లో జన్మించిన 13శాతం మంది చిన్నారులు కనీస బరువు కూడా లేకపోవడం అత్యంత విషాదకరం.



ఇక బాల్యవివాహాలు గణనీయంగా పెరిగిపోవడానికి కరోనా కూడా ఓ కారణమని తెలుస్తోంది. అమ్మాయిలు ప్రేమలో పడటం, పెద్దలకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటారన్న భయంతోనే మైనారిటీ తీరకుండానే వారికి పెళ్లిళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరగా పెళ్లి చేసేస్తే కొత్త ఇంటిలో త్వరగా కుదురుకుంటారన్న నమ్మకమూ ప్రబలుతోంది. ఇక పేదరికం, వలస జీవితాలు బాల్యవివాహాలను ప్రేరేపిస్తున్నాయని క్రైం దక్షిణ విభాగాధిపతి జాన్ రోబర్ట్స్ వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story