Harbor port: ముచ్చటగా మూడోసారి పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన

ఎన్నికలు వస్తున్నాయంటే బందరు పోర్టులో హల్‌చల్ నెలకొంటుంది. ముచ్చటగా మూడోసారి పోర్టుకు సీఎం జగన్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 2008లో దివంగత సీఎం వైఎస్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న ఈ పోర్టు పనులు అనేక కారణాలతో ఆగిపోయాయి. 2019 ఫిబ్రవరి 7న సీఎం హోదాలో చంద్రబాబు బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. అంతా సక్రమంగా సాగుతుందను కుంటున్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బందరు పోర్టును రివర్స్ బాట పట్టించింది. ఇప్పుడు...ఎన్నికల హడావుడి మొదలు కాగానే మళ్లీ బందరు పోర్టు పేరుతో హల్‌చల్ మొదలుపెట్టింది జగన్ సర్కార్.
ఇక బందరు పోర్టు నిర్మాణం ఉమ్మడి కృష్ణా జిల్లావాసుల చిరకాల వాంచ. బందరు పోర్టును అభివృద్ధి చేయాలని కోరుతూ దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగాయి. ఈ నేపధ్యంలో 2008 ఏప్రిల్ 23న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. పోర్టు పనులు మేటాస్ సంస్థ దక్కించుకుంది. అయితే, ఆర్థికపరమైన చిక్కుల్లో ఆ సంస్థ పడటంతో నవయుగ సంస్థకు పోర్టు పనులు అప్పగించారు. అయినా పనులు ముందుకు సాగలేదు. దీంతో మళ్లీ ఉద్యమాలు మొదలయ్యాయి.
రాష్ట్ర విభజన అనంతరం 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2015 ఆగస్టులో పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం 14వేల ఎకరాలను కేటాయించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణకు రైతులు ముందుకు రాకపోవడంతో 2016 ఆగస్టులో భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. పోర్టు అభివృద్ధి కోసం 2016లో మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుచేసి పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. నవయుగ సంస్థకు నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఆ తర్వాత రెండు నెలలకే ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చీ రాగానే పోర్టు నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదంటూ నవయుగ సంస్థను బాధ్యతల నుంచి తొలగించింది.
మరోవైపు దాదాపు 12వేల కోట్ల వ్యయంతో పోర్టు పనులు ఎలా పూర్తవుతాయన్న అనుమానాలు వస్తున్నాయి.ఆర్థిక పరిస్థితి అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఎలా పూర్తి చేస్తుంద న్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.పోర్టు పేరుతో నిధులు సమీకరించి వాటిని సంక్షేమ పథకాలకు దారి మళ్లించేందుకే అకస్మాత్తుగా పోర్టు శంకుస్థాపనను తెరపైకి తెచ్చారన్న వాదన ఉంది. పోర్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతోంది. నిర్మాణ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగించారు.తొలి దశలో 4వేల682 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.పోర్టు నిర్మాణానికి బ్యాంకుల నుంచి దాదాపు 4వేల కోట్ల రుణ సాయం తీసుకోనుంది జగన్ సర్కార్. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపధ్యంలో ఎన్ని రుణాలు తెచ్చినా పోర్టు నిర్మాణం పూర్తికాదన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల కోసం జగన్ సర్కార్ చేస్తున్న షో అంటున్నారు జనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com