AP: ఏపీ చరిత్రలో మరువలేని రోజు: నారా లోకేశ్

కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖపట్నంలో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో గూగుల్‌తో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో డిజిటల్ హబ్‌గా దేశానికి మంచి గుర్తింపు వస్తుందని నారా లోకేశ్ అన్నారు. ‘‘టెక్ ప్రపంచంలో ఏపీకి నేడు చరిత్రాత్మక రోజు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఇది కొత్త అధ్యాయం. గ్లోబల్ టెక్ మ్యాప్‌పై ఏపీని మరింత బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుంది. విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం సంతోషదాయకం. రాష్ట్రంలో పెట్టుబడులకు కొదవే లేదు. విజనరీ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయి’’ అని లోకేశ్ అన్నారు.
కూటమి ప్రభుత్వంలోనే...
ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యోగ కల్పన, రాష్ట్రానికి ఆదాయం పెంచేందుకు ప్రయత్నిస్తోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. గూగుల్ లాంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా రూపుదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. ఏపీలో డేటా సెంటర్ కోసం గత సంవత్సరకాలం నుంచి మంత్రి నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారని పెమ్మసాని గుర్తు చేశారు. రూ.90,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్‌ను కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. దానివల్ల 6 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒక్క డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి పదివేల కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. అమరావతిలో క్వాంటం, విశాఖలో ఏఐ రూపుదిద్దుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com