AP: దేశ వ్యవసాయానికి ఏపీ కీలక కేంద్రం: కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్

దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా సుమారు 10 శాతం వరకు ఉందని ఆయన వెల్లడించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలో ఈ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యంగా పీఎం ప్రణామ్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ను మరింత విస్తరించేందుకు కేంద్రం నుంచి తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ, సేంద్రియ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, ఆ తగ్గింపుకు అనుగుణంగా కేంద్రం నుంచి ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.216 కోట్ల మేర నిధులు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో సాగులో రసాయనాల వినియోగం ఇప్పటికే 2.28 శాతం మేర తగ్గిందని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొబ్బరి సాగు అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇందుకోసం సుమారు రూ.200 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కోరారు. కోకోనట్ ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటు, కర్ణాటక తరహాలో ఆధునిక టెండర్ కొబ్బరి మార్కెట్ల స్థాపన, కొబ్బరి రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ, నర్సరీల విస్తరణ వంటి అంశాల్లో కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే సమావేశంలో ఏపీలో మఖానా డెవలప్‌మెంట్ బోర్డు ఏర్పాటు ప్రతిపాదనను కూడా సీఎం ప్రస్తావించారు. కొల్లేరు సరస్సు పరిసర ప్రాంతాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తే ఇది మంచి ఆదాయ వనరుగా మారుతుందని వివరించారు. వ్యవసాయం, మత్స్యరంగం, పశుపోషణ రంగాల అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని, ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని కూడా నియమించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. సేంద్రియ సాగు, పామాయిల్ ఉత్పత్తిలో ఏపీ మంచి ఫలితాలు సాధిస్తోందని ప్రశంసిస్తూ, ఈ రంగాల విస్తరణకు కేంద్రం పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
