AP: ఏపీ రోడ్లు..నాలుగు గిన్నీస్ రికార్డులు

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రహదారుల నిర్మాణం అత్యంత వేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రం మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా చేపట్టిన రహదారి పనుల్లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కేవలం వారం రోజుల వ్యవధిలోనే నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనవరి 6న రెండు, జనవరి 11న మరో రెండు ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 554జీ (BKV) ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా అమలవుతోంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలోని వంకరకుంట–సాతర్లపల్లి మధ్య ఈ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఎన్‌హెచ్ఏఐ పర్యవేక్షణలో, రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ పనులను అత్యంత వేగంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. కేవలం ఏడు రోజుల్లోనే 156 లేన్ కిలోమీటర్ల మేర రహదారిని నిర్మించి, దాదాపు 57,500 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీటును వేసి ఈ అరుదైన రికార్డులను నెలకొల్పింది. “ఇది చైనా కాదు, జర్మనీ కాదు, అమెరికా కాదు… ఇది సరికొత్త భారత్. ఏపీలో రహదారుల నిర్మాణంలో ప్రపంచ స్థాయి రికార్డులు నమోదవుతున్నాయి” అన్నారు.
గిన్నీస్ రికార్డ్ 1 :
ఎన్‌హెచ్ఏఐ 6న పుట్టపర్తి సమీపంలో రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించినట్లు ప్రకటించింది. బెంగళూరు- కడప- విజయవాడ కారిడార్ ప్యాకేజీ -2, ప్యాకేజీ-3లో ఈ రికార్డులు నమోదయ్యాయి. అందులో మొదటి రికార్డ్.. ఈ నెల 6వ తేదీన 24 గంటల వ్యవధిలో 28.95 కిలోమీటర్లు తారురోడ్డు నిర్మించారు. ఇంత వేగంగా రహదారి నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.
గిన్నీస్ రికార్డ్ 2 :
24 గంటల్లో10,675 టన్నుల బిటుమినస్ కాంక్రీట్‌ను ఉపయోగించడం కూడా ప్రపంచంలో ఇదే మొదటి సారి.
గిన్నీస్ రికార్డ్ 3 :
అనంతరం జనవరి 11న మరో రెండు రికార్డులతో గిన్నిస్ రికార్డులు నమోదు చేసినట్లు వెల్లడించింది. రాత్రింబవళ్లు 600 మందికిపైగా ఇంజనీర్లు, కార్మికులు ఏకధాటిగా పనిచేసి.. 156 లేన్ కిలోమీటర్ల రహదారి నిర్మించారు.
గిన్నీస్ రికార్డ్ 4 :
ఇందుకోసం 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్(కంకర, తారు)ను ఉపయోగించి మరో గిన్నిస్ రికార్డు సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

