ap: ఏపీ ప్రభుత్వంలో మరో కొత్త శాఖ..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో కొత్త శాఖకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రూపొందించే లక్ష్యంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం, అటవీ శాఖలో ఒక సబ్జెక్టుగా ఉన్నప్పటికీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, రీసెర్చ్, ఇన్నోవేషన్లను వేగవంతం చేసేందుకు దీనిని స్వతంత్ర శాఖగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జులై 19న అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ఈ ఆలోచనను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను 2030 నాటికి భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో SRM యూనివర్శిటీ-APని నోడల్ ఏజెన్సీగా నియమించనున్నారు. 5 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి సామర్థ్యం, 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తితో 25 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిక్లరేషన్‌ను ప్రకటించిన చంద్రబాబు
దేశంలోనే అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో ‘అమరావతి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ- అమరావతి డిక్లరేషన్’ను చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. 2030 నాటికి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక ప్రణాళికను వెల్లడించారు. ఈ రంగంలో పరిశోధన, ఆవిష్కరణకు రూ.500 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ‘శుద్ధ ఇంధన, గ్రీన్ హైడ్రోజన్ తయారీ విధానాలను తీసుకురావడమే డిక్లరేషన్ ప్రధాన లక్ష్యం. దీనికోసం రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ అభివృద్ధి చేస్తాం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి పెంచేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తాం’ అని సీఎం పేర్కొన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఇటీవల జరిగిన ‘గ్రీన్ హైడ్రోజన్ సమిట్-2025’లో పారిశ్రామిక నిపుణులు, భాగస్వామ్యపక్షాలు కలిపి సుమారు 600 మంది పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com