AP: కీలక ప్రతిపాదనలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రుల సమావేశంలో 70 అజెండా అంశాలపై చర్చ జరగగా వీటికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా పలు సంస్థలకు భూములు కేటాయింపుతో పాటు రాయితీలు ఇచ్చేందుకు మంత్రులు ఆమోదం తెలిపారు. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పేదలకు ఇళ్ల మంజూరు విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు. నివాస స్థలం లేని వారి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని పేర్కొన్నారు. అజెండాపై చర్చించిన తర్వాత వివిధ అంశాలపై మంత్రులతో సీఎం మాట్లాడారు. మొంథా తుపాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణసాయం అందేలా చేశారని అభినందించారు. అధికారులతో సమన్వయంతోనే సహాయక చర్యలు వేగంగా అందాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రవర్గ సమావేశంలో మరోసారి ప్రస్తావించారు. ఆ ఎమ్మెల్యేల విషయంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రులు బాధ్యతలు పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పెన్షన్లు పంపిణీ చేయడం, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారు. అలాంటి వారిపై చంద్రబాబు అసహనంతో ఉన్నారు. కేబినెట్ లో ఎజెండాపై చర్చ తర్వాత మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించారు. వైజాగ్ సమిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. ప్రతిష్టాత్మకంగా తీస్కుని పని చెయ్యాలన్నారు. పెద్దిరెడ్డి ఆక్రమణలపై పూర్తి సాక్ష్యాలతో వీడియోలు తీయించానని కేబినెట్ సమావేశంలో పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ సందర్భంగా పవన్ పనితీరును సీఎంతోపాటు సహచర మంత్రులు ప్రశంసించారు. ఎర్ర చందనం డిపో సందర్శనపై తన అనుభవాలను పవన్ కేబినెట్ భేటీలో పంచుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనంతో పరికరాలు తయారు చేయించి విక్రయించే ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

