AP: ముప్పు వేళ అప్రమత్తంగా ఏపీ సర్కార్

తుపాను తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. గాలులకు విద్యుత్తు స్తంభాలు, వైర్లు తెగి పడే అవకాశం ఉండడంతో సరఫరా పునరుద్ధరణ కోసం 1,000 ప్రత్యేక బృందాలతో 12,000 మంది సిబ్బందిని ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించకుండా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయ బాధ్యతను మంత్రి లోకేశ్‌కు అప్పగించారు. పంట నష్టపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.
ప్రమాదాలు జరగొద్దు
మొంథా తుపాను కారణంగా ఎక్కడా ప్రమాదాలు జరగకుండా చూడాలని, ఒక్క మరణమూ సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీశారని.. కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని భరోసా ఇచ్చారని వెల్లడించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతను మంత్రి లోకేశ్‌కు అప్పగించారు. తుపాను రక్షణ విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన తుపాను సన్నాహక చర్యలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆర్టీజీఎస్లో సమీక్ష నిర్వహించారు. ప్రతి గంటకు తుపాను బులెటిన్లు ఇస్తూ అప్రమత్తం చేయాలి. తుపాను ప్రభావం అధికంగా ఉండే 2,707 గ్రామ/ వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. 110 మండలాల్లోని సచివాలయాల్లో ఉన్న 3,211 జనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించుకోవాలి. కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం లేకుండా చూడాలి. ప్రత్యేక మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలి. శాటిలైట్ ఫోన్లు ఉపయోగించాలి’ అని ఆదేశించారు. తుపానుల్ని ఎదుర్కొనేందుకు కూడా ముందుగానే ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
మొంథా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనుందని తెలిపారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై పవన్ కల్యాణ్ తన క్యాంపు కార్యాలయంలోవీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు కాకినాడ జిల్లా ఇన్చార్జి మంత్రి పి. నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ బిందు మాధవ్, అధికారులు హాజరయ్యారు.
కాకినాడ జిల్లాలో 12 మండలాలపై మొంథా తుపాను ప్రభావం ఉంటుందని తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని సూచించారు పవన్ కల్యాణ్. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగునీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకి గురికాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మొంథా తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

