AP: బనకచర్లపై వెనక్కి తగ్గిన ఏపీ టెండర్లు రద్దు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్లపై వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి డీపీఆర్ కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో జరిగిన పోలవరం అథారిటీ సమావేశంలో ఈ అంశాన్ని వెల్లడించింది. అంతర్రాష్ట్ర నదీజలాల ఒప్పందాలకు విరుద్ధంగా ఏపీ ఈ ప్రాజెక్టును చేపడుతోందని తెలంగాణ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై కేంద్రానికి, సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. న్యాయపోరాటానికీ సిద్ధమైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు లేనట్టేనని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలకు ఎలాంటి వివాదం రాకుండా మరో ప్రణాళికతో కూడా ఏపీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం-బనకచర్ల అనుసంధానం స్థానంలో పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డీపీఆర్ తయారీకి పాత పేరు, పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావించారు. ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కిందిస్థాయి అధికారులకు అందాయి. దీంతో డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జలవనరుల శాఖ ఎస్ఈ పిలిచిన టెండర్లను తాజాగా రద్దు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ....
బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు.. రెండు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం ఏర్పాటు చేసిన మీటింగులోనూ పాల్గొన్నారు. ఆనాడు లోపల బనకచర్ల గురించి చర్చ జరగలేదని చెప్పినా.. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బయట మీడియాతో బనకచర్లను కట్టితీరుతామని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యవహారం డీపీఆర్తయారీకి టెండర్ల వరకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై ఈఎన్సీ జనరల్పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో పాటు సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేశారు. టెండర్ల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని డిమాండ్‌చేశారు. ఏపీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు చేపడ్తోందని, వరద జలాల కాన్సెప్టే లేనప్పుడు దాని ఆధారంగా ఎలా ప్రాజెక్టును చేపడతారని ప్రశ్నించారు. వెంటనే టెండర్ల ప్రక్రియను ఆపడంతో పాటు ముందుకు వెళ్లకుండా ఏపీని కట్టడి చేయాలని కోరారు.బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుపై తెలంగాణ మొదటనుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

