AP:‘సాక్షి’కి ఏపీ శాసనసభ నోటీసులు

సాక్షి మీడియాకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని ఏపీ శాసనసభాపతి అయ్యనపాత్రుడు నిర్ణయించారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు నిర్వహించకుండా రూ. కోట్లు వెచ్చించారంటూ ‘సాక్షి’లో కథనం ప్రచురించడాన్ని.. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు. సభాపతి నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక, మీడియాపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగం వేళ.. వైసీపీ ప్రజా ప్రతినిధుల తీరు బాధ కలిగించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో వైసీపీ తీరు అభ్యంతరకరమన్న స్పీకర్.. ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ అలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. కొందరు సభ్యులు కాగితాలు చింపి పోడియం మీదకు విసిరేశారన్న సభాపతి... ఇలాంటి పనులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. జగన్ నవ్వుతూ కూర్చున్నారే కానీ వారించలేదన్నారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. సోమవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.
ప్రతిపక్ష నేత హోదాను జగన్ మర్చిపోవాల్సిందే..?
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేదే లేదని అధికార పక్షం స్పష్టం చేయడంతో ఈ 5 సంవత్సరాలు జగన్ పార్టీకి ప్రతిపక్ష నేత హోదా దక్కడం కష్టంగానే మారింది. ఈ విషయంలో ఇప్పటికే వైసీపీ కోర్టును కూడా ఆశ్రయించింది. అయితే, గతంలో జగన్ కూడా శాసనసభలో తాను చిటికేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్న మాటలను టీడీపీ నేతలు గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com