AP: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:00 గంటలకు శాసనసభ, 10:00 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. శాసన సభ సమావేశాలు ప్రారంభం సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ, డీజీపీతో పాటు ఇతర కీలక అధికారులు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు పటిష్ట భద్రతపై చర్చించారు. ఇవాళ ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నోత్తరాల అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీసమావేశమవుతుంది. ఈ సమావేశంలో వర్షాకాల సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశముంది. ఇటీవల రాష్ట్రంలో వచ్చిన వరదలు, వర్షాలకు జరిగిన నష్టం, తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పథకాల అమలుపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. వైఎస్ఆర్సీపీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే తాము వచ్చేది లేదని ఇప్పటికే తేల్చేశారు. అయితే వరుసగా అరవై రోజుల పాటు సభకు రాకపోతే అనర్హతా వేటు వేసే అధికారం సభకు ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com