AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు

AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3,32,205 కోట్లు
X
రాయలసీమ ప్రాజెక్టుల పూర్తి, నిరుద్యోగ భృతి, మహిళా సాధికారతకు బడ్జెట్‌లో పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల అనంతరం, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌కు సూచించారు. మంత్రి సభలో బడ్జెట్ ప్రతిపాదనలను వివరంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ బడ్జెట్ కేవలం లెక్కల పత్రం కాదని, రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల ఆశయాలు, అభిలాషలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. మొత్తం రూ.3,32,205 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక దిశను నిర్ధేశించేదిగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక లోటు రూ.75,868 కోట్లుగా ఉండగా, రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లుగా ఉందని వెల్లడించారు. మూలధన వ్యయం రూ.53,915 కోట్లు కేటాయించామని, కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.64,362 కోట్లు లభిస్తాయని చెప్పారు. రాష్ట్ర పన్ను ఆదాయం రూ.1,25,845 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.11,473 కోట్లుగా అంచనా వేశామని సభకు వివరించారు.

రాష్ట్రాభివృద్ధి మరియు ప్రజా సంక్షేమం పరస్పరం అనుబంధమైన అంశాలని, ఈ రెండింటినీ సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు సంపద సృష్టి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంత రైతుల సమస్యలను ప్రస్తావించిన మంత్రి, సాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రతి ఎకరాకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ చర్యల ద్వారా దశాబ్దాలుగా ఉన్న రైతుల ఆశలను నెరవేర్చడం తమ కర్తవ్యమని పేర్కొన్నారు. మొత్తంగా, ఈ బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక స్థిరత్వంతో పాటు సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదిగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags

Next Story