AP: నేడే ఏపీ బడ్జెట్.. భారీ ఆశలు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌ను నేడు(శుక్రవారం) సమర్పించనుంది. ఉదయం 10 గంటలకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్... శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. శాసనసమండలిలో కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో అచ్చెన్నాయుడు, మండలిలో నారాయణ ప్రవేశపెడతారు. సుమారు రూ.3.24 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. అమరావతి, పోలవరంతోపాటు... వెలిగొండ, వంశధార, హంద్రీనీవా ప్రాజెక్టులకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది.
వీటికి ప్రాధాన్యం..!
వ్యవసాయ బడ్జెట్ రూ.50 వేల కోట్లు దాటే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్‌లో మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమివ్వనున్నారని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉప ప్రణాళిక ప్రకటిస్తారని సమాచారం. అభివృధ్ధి పనులతో పాటు సంక్షేమ పథకాల అమలుకు ఈ బడ్జెట్ ప్రాధాన్యం ఇవ్వబోతోంది. కూటమి ప్రభుత్వ ఎన్నికల మ్యానిఫెస్టో అమలుకు, సూపర్‌సిక్స్‌లో కీలక సంక్షేమ పథకాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే అమరావతి రాజధాని నిర్మాణానికి అడుగులు పడబోతున్నాయి. ఇందుకు సింహభాగం కేటాయింపులు ఉంటాయి. పోలవరం ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉన్నందున కేంద్ర సాయంతో చేపట్టే ఈ పథకానికి నిధులు దక్కనున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్యాంధ్రలోని కరవు ప్రాంతాలకు, మెట్ట ప్రాంతాలకు సాగు, తాగు నీరందించే సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు ఉంటాయి.
నేడు మంత్రివర్గ సమావేశం..
బడ్జెట్ ప్రవేశానికి ముందు నేడు ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత గవర్నర్, స్పీకర్‌ను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కానుంది. యథావిధిగా వైసీపీ ఈ బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదా గుర్తింపు ఇవ్వకపోవడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com