AP BUDGET: ఫిబ్రవరి 14న సభలో ఏపీ బడ్జెట్

ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన నిర్వహించిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 7 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని.. అవసరమైతే పొడిగించాలని నిర్ణయించారు. 17 రోజులపాటు అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈనెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 15 ఆదివారం కాగా.. మహా శివరాత్రి తర్వాత రోజు 16న సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక మంత్రి సమాధానం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. మార్చి 6న అమరావతిలోనే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని.. రోజూ జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయించారు.
అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్ విధానం అమల్లోకి రానుంది. ఇకపై సభ్యుల హాజరు నమోదు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా జరగనుంది. సభ్యులు అసెంబ్లీకి వచ్చి సభ లోపల తమ స్థానాల్లో కూర్చున్న తర్వాత మాత్రమే వారి హాజరు నమోదు అయ్యే విధంగా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ కొత్త విధానాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రవేశపెట్టారు. ఇకపై సంప్రదాయంగా ఉపయోగిస్తున్న హాజరు రిజిస్టర్ విధానం ఉండదని అసెంబ్లీ సెక్రెటరీ జనరల్ ప్రసన్న కుమార్ నిన్న విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపారు.
వైసీపీ పాలనపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు
గత వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ గవర్నర్ ప్రసంగం కొనసాగించారు. 2019 తర్వాత రాష్ట్రంలో వ్యవస్థాగతమైన వైఫల్యాలు తలెత్తాయని, ఆ కాలంలో వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమై ఆర్థిక ఒత్తిడి పెరిగిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం 19 నెలలుగా ఆ విచ్ఛిన్నమైన వ్యవస్థలను పునరుద్ధరిస్తోందని పేర్కొన్నారు. సూపర్-6 వంటి పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్తోందని ప్రశంసించారు. తమ ప్రభుత్వ పాలనలో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామన్నారు.
ప్రగతి పథం వైపు,....
2019 తర్వాత రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటిపారుదల రంగాలు తీవ్ర తిరోగమనం చెందాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. చేదు అనుభవాలతో విసిగివేసారిన ఏపీ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని తెలిపారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతిపథం వైపు పయనిస్తోందని అన్నారు. సూపర్-6 ఇతర సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యకలాపాలను పునఃప్రారంభించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టామని గవర్నర్ తెలిపారు. రాష్ట్రానికి జీవధార అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వేగంగా పనులు చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యతలలో కీలక సవరణలు చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. దీర్ఘకాలిక దార్శనికతతో కూడిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించామని తెలిపారు. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశామని అన్నారు. సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేయడానికి 10 సూత్రాలు రూపొందించామని స్పష్టం చేశారు. సంపదను సృష్టించే ప్రగతి చక్రాన్ని నిర్మించడమే కాకుండా పది సూత్రాల లక్ష్యాన్ని పెట్టుకున్నామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
