AP CABINET: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల పునర్ విభజనలో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది. ఇందులో గతంలో ఆమోదించిన రెండు జిల్లాలతో పాటు కొత్తగా మరో జిల్లా కూడా ఉంది. దీంతో ఈ జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ నిర్ణయంతో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 28కి పెరగనుంది. దీనికి సంబంధించి రేపు తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిని మదనపల్లె కొత్త జిల్లాకు, రాజంపేటను కడప జిల్లాకు, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాకు, గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరులో కలిపే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గతంలో ఏర్పాటు చేసిన 25 జిల్లాలకు తోడు మార్కాపురం, మదనపల్లె జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం అనంతరం రంపచోడవరం కేంద్రంగా మన్యంలో మరో జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
విధిలేని పరిస్థితుల వల్లే...
మంత్రివర్గం ముగిశాక వివిధ తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. విధిలేని పరిస్థితుల్లోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. రాయచోటి కేంద్రంగా జిల్లా కోసం మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి పోరాడుతున్నారని, ఒక్క నియోజకవర్గాన్ని జిల్లా చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజంపేట వాసులు కడపను కోరుకుంటున్నారని, రైల్వేకోడూరు వాసులు తిరుపతి కోరుకుంటున్నారని సీఎం అన్నారు. రాయచోటి మార్పు తప్పట్లేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం మార్పు తప్పలేదని వివరించారు. ఆదోని 2 మండలాల ఏర్పాటుపై భేటీలో చర్చ సాగింది. మూడు మండలాల ఏర్పాటుపై చర్చ జరగగా, 2 మండలాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు.
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పు అంశంపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ మార్పుపై మంత్రి రాంప్రసాద్‌రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. జిల్లా కేంద్రం మార్పు వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుందని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రిని ఓదార్చి ధైర్యం చెప్పారు. జిల్లా కేంద్రం మార్పు చేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను సీఎం వివరించారు. అలాగే రాయచోటి అభివృద్ధిని తానే ప్రత్యేకంగా చూసుకుంటానని, పట్టణానికి ఎలాంటి నష్టం జరగనివ్వబోనని సీఎం చంద్రబాబు మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి హామీ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

