AP CABINET: నేడే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం భేటీ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాలు రీ షెడ్యూల్ స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు పై కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు చెత్త పన్ను రద్దు, 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనలపై మంత్రి వర్గం చర్చలు జరపనుంది. ఈ క్రమంలో ఏపీలోని దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చించి కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులు సభ్యులుగా నియమించే అంశంపై, దీపావళి నుంచి ప్రభుత్వం ఇచ్చే ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది.
18న ఎమ్మెల్యేలతో భేటీ
తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవనున్నారు. ఈనెల 18న ఎమ్మెల్యీలు, ఎమ్మెల్సీలతో సమావేశం అవనున్న సీఎం.. పార్టీ బలోపేతం, సభ్యత్వం, ప్రభుత్వ విధానాలపై చర్చించనున్నారు. మద్యం, ఇసుక వ్యవహారాలలో ఎమ్మెల్యేల జోక్యం చేసుకోవడంపై కూడా ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీపరంగా ఎమ్మెల్యేలతో తొలిసారిగా చంద్రబాబు భేటీ అవుతున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ క్రమంలో సమావేశానికి సంబంధించి ఎజెండాను పార్టీ కేంద్ర కార్యాలయం తయారు చేస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో చేస్తున్న దందాలపై కూడా సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇవ్వనున్న ట్లు తెలుస్తోంది.
పల్లె పండుగపై చంద్రబాబు హర్షం
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీలోని 13,326 గ్రామాల్లో మొత్తం 30 వేల పనులు చేపట్టాలనే బృహత్ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అభినందించారు. రూ.4,500 కోట్లతో చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో ఉపాధి కల్పిస్తూ, పల్లెల్లో మళ్లీ వెలుగులు తెస్తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాల్లో సంతోషం నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com