AP : 18న ఏపీ రాష్ట్ర కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 18న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మంత్రి మండలి సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి.
అలాగే ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో వరదల నియంత్రణ, అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు పలు అంశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇటీవల సంభవించిన వరదల వలన కలిగిన నష్టం, ఆపరేషన్ బుడమేరుతో పాటుగా రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో నిర్మాణాలు, నూతన మద్యం పాలసీపైనా మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలిసింది.
ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో వరదల నియంత్రణ కోసం బుడమేరు ఆధునికీకరణ, ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వరద నష్టం అంచనాతో పాటు భవిష్యత్తులో వరదల నియంత్రణకు ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ సమావేశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com