AP Cabinet : చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు (జూలై 24, 2025, గురువారం) రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సుమారు 42 అంశాలు ఎజెండాగా ఈ కేబినెట్ భేటీ సాగనుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బిల్డింగ్ పీనలైజెషన్ స్కీమ్ (BPS) మరియు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS)లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటి వల్ల అక్రమ నిర్మాణాలు, లేఔట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం లభిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. పలు ముఖ్యమైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 7వ ఎస్ఐపీబీ (SIPB) సమావేశంలో ఆమోదం పొందిన 19 ప్రాజెక్టులకు సంబంధించిన రూ. 28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో 1450 ఎకరాలలో మౌలిక వసతుల కల్పనకు రూ. 1052 కోట్లతో టెండర్లు పిలవడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డును జాతీయ రహదారి 16కి అనుసంధానం చేయడానికి రూ. 682 కోట్లతో టెండర్లు ఆహ్వానించే అంశంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలో త్వరలో అమలు చేయనున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాల అమలు, వాటి విధివిధానాలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. పలు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఈ కేబినెట్ సమావేశం అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేయబోయే కార్యక్రమాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి కీలకమైనవిగా భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com